క‌ర్నాట‌కంలో కొత్త వ్యూహం… ద‌ళిత సీఎం అంశాన్నితెరపైకి తెచ్చిన పార్టీలు

Congress and BJP focus on Dalit CM Candidate in Karnataka elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క‌ర్నాట‌క రాజ‌కీయాలు ఎన్నిక‌ల త‌ర్వాత ఊహించ‌ని మ‌లుపు తిరిగాయి. సాధార‌ణంగా జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు ఏవైనా… ఎన్నిక‌ల‌కు ముందు ఒకరిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్టే… పార్టీ గెలిచిన త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా ఆ వ్య‌క్తే ముఖ్య‌మంత్ర‌వుతారు. ఏద‌న్నా వివాదంలో చిక్కుకుంటే త‌ప్ప‌… ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థిని రేసు నుంచి త‌ప్పించే అవకాశం అంత‌గా ఉండ‌దు. నిజానికి ఓ అభ్య‌ర్థికి వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మా బాగా ఉండి… ఆయ‌న వ‌ల్ల ఓట్లు ప‌డ‌తాయని భావిస్తేనే జాతీయ‌పార్టీలు రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ముందుగా ప్ర‌క‌టిస్తాయి. ఎక్కువ సంద‌ర్భాల్లో… ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు విడుద‌లైన త‌ర్వాతే… ముఖ్య‌మంత్రి రేసులో ఉన్న వారి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. కానీ క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో ఈ సారి రెండు జాతీయ పార్టీలు త‌మ అభ్య‌ర్థిని ముందుగానే ప్ర‌క‌టించాయి. ఆ ఇద్ద‌రు నాయ‌కుల‌కు క‌ర్నాట‌క‌లో ఉన్న ప్ర‌జాద‌ర‌ణ ఓట్ల రూపంలో మారుతుంద‌ని జాతీయ పార్టీలు వ్యూహం ర‌చించాయి. ఆ తీరులోనే ప్ర‌చారం నిర్వ‌హించాయి. అందుకే కాంగ్రెస్ గెలిస్తే ప్రస్తుత ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌, బీజేపీ గెలిస్తే మాజీ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప సీఎం అవుతార‌ని అంతా భావించారు.

కానీ ఎన్నిక‌లు ముగిసి ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల‌వ్వ‌గానే… రెండు పార్టీల అభిప్రాయాలు మారిపోయాయి. క‌ర్నాట‌కంలో హంగ్ త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ‌ల నేప‌థ్యంలో… కాంగ్రెస్, బీజేపీ రెండింటిలోనూ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి రేసులో కొత్త కొత్త పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. కాంగ్రెస్ లో ద‌ళిత సీఎం అంశంపై చ‌ర్చ న‌డుస్తుండ‌గా… బీజేపీలో ఆమోద‌యోగ్య‌మైన నేత ఎవ‌ర‌నేది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజ‌యం సాధిస్తుందని, తాను పోటీచేసిన బాదామి, చాముండేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఘ‌న విజ‌యం సాధించి… మ‌రో మారు ముఖ్య‌మంత్రిగా తాను బాధ్య‌త‌లు చేప‌డ‌తాన‌ని ఇప్ప‌టిదాకా చెబుతూ వ‌చ్చిన సిద్ధ‌రామ‌య్య‌… తాజా ప‌రిణామం త‌ర్వాత వెన‌క్కి త‌గ్గారు. ద‌ళిత నాయ‌కుడిని ముఖ్య‌మంత్రిని చేయాల‌ని పార్టీ నాయ‌క‌త్వం కోరుకుంటే మంచిదేనన్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో ద‌ళిత నేత కోటాలో లోక్ స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నాయ‌కుడ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్. జి. ప‌ర‌మేశ్వ‌ర్ తో పాటు కోలారు ఎంపీ కె.హెచ్. మునియ‌ప్ప పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.

ఖర్గే, ప‌ర‌మేశ్వ‌ర్ కీల‌క పోటీదారులుగా మిగ‌ల‌నున్నారు. దీనిపై ఖర్గే స్పందించారు. కాంగ్రెస్ లో విభేదాలు ర‌గిల్చేందుకే ద‌ళిత ముఖ్య‌మంత్రి అంశాన్ని మీడియా తెర‌పైకి తెచ్చింద‌ని ఖ‌ర్గే ఆరోపించారు. తాము చాలా స్ప‌ష్టంగా ఉన్నామ‌ని, అధిష్టానం దీన్ని నిర్ణ‌యిస్తుంద‌ని, ఇది 12 గంట‌ల్లో జ‌రిగిపోయే ప‌ని అని ఖ‌ర్గే స్ప‌ష్గంచేశారు. అటు బీజేపీ విష‌యానికొస్తే… ఏ పార్టీకి మెజారిటీ రాకుండా జేడీఎస్ తో క‌లిసి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసే ప‌రిస్థితి వ‌స్తే యడ్యూర‌ప్ప‌ను ముఖ్య‌మంత్రిని చేసే అవ‌కాశాలు త‌క్కువ‌ని భావిస్తున్నారు. 2008లో బీజేపీ, జేడీఎస్ క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసిన‌ప్పుడు కుమార‌స్వామి-య‌డ్యూర‌ప్ప మ‌ధ్య స‌ఖ్య‌త లేని విష‌యాన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అధిష్టానం కేంద్ర‌మంత్రి అనంత్ కుమార్ హెగ్డేను ప్ర‌త్యామ్నాయంగా భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆరెస్సెస్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన హెగ్డే,.. ప‌దునైన వాగ్ధాటితో పాటు పార్టీలో యువ‌కార్య‌క‌ర్త‌ల‌ను స‌మ‌న్వ‌య ప‌రిచే స‌త్తా ఉన్న‌వాడిగా గుర్తింపు పొందారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు రేపు విడుద‌లైన త‌ర్వాత‌… రెండు, మూడు రోజుల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది ఖ‌రార‌వుతుంది.