వలసలకు కాంగ్రెస్‌ కారణం

వలసలకు కాంగ్రెస్‌ కారణం

కేంద్రంలో, రాష్ట్రంలోని గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు ఉత్తరాఖండ్‌ అభివృద్ధి ప్రాజెక్టులను జాప్యం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ వల్ల ఉత్తరాఖండ్‌ గ్రామాల్లో ప్రజలు పొట్ట చేతబట్టుకొని వలసలు పోవాల్సివచ్చిందని విమర్శించారు. గత ప్రభుత్వానికి రాష్ట్రాన్ని దోచుకోవడం మీదనే శ్రద్ధ ఉండేదని, అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని నిప్పులు చెరిగారు.

ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా ఆయన రూ.17,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆరంభించడం, శంకుస్థాపన చేశారు. వీటిలో రూ. 5,747కోట్ల విలువైన లఖ్వార్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ శంకుస్థాపన కూడా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన 1974లోదని, కానీ కార్యరూపం దాల్చేందుకు ఇన్నాళ్లు పట్టిందని మోదీ గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ పాపమని, దీన్ని ప్రజలు మర్చిపోరని విమర్శించారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటామని, విపక్షాలు స్వీయ ప్రయోజనాలు చూసుకుంటాయని ఎద్దేవా చేశారు.