కాంగ్రెస్ అనూహ్య నిర్ణ‌యం టీడీపీ ఎంపీల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా నోటీసులు

Mallikarjun Kharge notices in support of TDP MPs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లోక్ స‌భ‌లో కీల‌క‌ప‌రిణామం చోటుచేసుకుంది. ఏపీకి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఏపీ విభ‌జ‌న‌చ‌ట్టం, ప్ర‌త్యేక‌హోదాపై చర్చ జ‌ర‌పాల‌ని కోరుతూ కాంగ్రెస్ నోటీసులిచ్చింది. రూల్ 184 కింద ఏపీకి ప్ర‌త్యేక‌హోదాపై చ‌ర్చ‌తో పాటు ఓటింగ్ జ‌ర‌పాల‌ని లోక్ స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడ‌ర్ మల్లికార్జున ఖ‌ర్గే నోటీసులు అందించారు. టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ మంత‌నాలు జ‌రిపిన కాసేప‌టికే మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఈ నోటీసులివ్వ‌డం గ‌మ‌నార్హం. టీడీపీకి మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణ‌యం బీజేపీని షాక్ కు గురిచేసింది. ఇలాంటిదేదో జ‌రుగుతుంద‌ని ముందుగా ఊహించ‌డం వ‌ల్లే బుధ‌వారం లోక్ స‌భ‌లో చేసిన త‌న ప్ర‌సంగంలో ప్ర‌ధాని విభ‌జ‌న నేరాన్ని కాంగ్రెస్ పై నెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

మిత్ర‌ధ‌ర్మాన్ని ప‌క్క‌న‌బెట్టి మ‌రీ లోక్ స‌భ‌లో ఆందోళ‌న‌లు చేస్తున్న టీడీపీని ప‌న్నెత్తు మాట కూడా అనుకుండా, కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ద్వారా ప్ర‌ధాని వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హరించారు. విభ‌జ‌న నాటి ప‌రిస్థితుల‌ను గుర్తుచేయ‌డం ద్వారా టీడీపీ కాంగ్రెస్ మ‌ధ్య సంబంధాలు బ‌లోపేతం కాకుండా చూడాల‌నుకున్నారు. కానీ మోడీ ప్ర‌సంగం త‌ర్వాత కాంగ్రెస్ జాగ్ర‌త్త ప‌డింది. నిజానికి విభ‌జ‌న‌స‌మ‌యంలోనూ, త‌ర్వాత ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. కాంగ్రెస్ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని పూడుస్తుంద‌ని, రాష్ట్రానికి స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తుంద‌ని బీజేపీపై న‌మ్మ‌కం పెట్టుకుని ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్ల‌యినా… ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డం, ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం, ప్ర‌త్యేక ప్యాకేజీపై ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డం, చివ‌రి పూర్తిస్థాయి బ‌డ్జెట్ లోనూ కేటాయింపులు జ‌ర‌ప‌క‌పోవ‌డంతో ఏపీ ప్ర‌జ‌లు బీజేపీ పేరెత్తితేనే మండిప‌డుతున్నారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్ పై ఉన్న ఆగ్ర‌హం ఇప్ప‌డు బీజేపీపైకి మళ్లింది. టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సైతం లోక్ స‌భ‌లో ఇదే ర‌కం అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌క‌పోతే గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు ప‌ట్టిన‌గ‌తే బీజేపీకీ ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా నిర్ణ‌యం తీసుకుంది. నాలుగురోజులుగా లోక్ స‌భ‌లో టీడీపీ, వైసీపీ ఎంపీలే కాదు…రాజ్య‌స‌భ‌లో త‌మ పార్టీ ఎంపీ కేవీపీ ఆంధ్ర‌కు న్యాయంచేయాల‌ని ఒంట‌రిపోరాటం చేస్తున్నా కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌కపోవ‌డ‌మే కాదు…కేవీపీ వైఖ‌రిని త‌మ స‌మ‌ర్థింబోమ‌ని కూడా ఆ పార్టీ నేత‌లు రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. అలాంటి కాంగ్రెస్ వైఖ‌రి ప్ర‌ధాని ప్ర‌సంగం త‌ర్వాత మారిపోయింది. టీడీపీ ఎంపీలతో ఒక‌సారి మాట్లాడి రాష్ట్ర ప‌రిస్థితిని తెలుసుకున్న త‌ర్వాత సోనియా గాంధీ ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కాంగ్రెస్ ఇదేవైఖ‌రి త‌ర్వాత కూడా కొన‌సాగించి ఏపీ హామీల అమ‌లుకోసం పోరాటం చేస్తే…రాష్ట్రంలో ఆ పార్టీ బ‌లోపేతమ‌య్యే అవ‌కాశ‌ముంది.