అభిశంస‌న తిర‌స్క‌ర‌ణ‌పై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన కాంగ్రెస్…

Congress Moved To Supreme Court On Rejection of CJI Impeachment Notice

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా అభిశంస‌న తిర‌స్క‌ర‌ణ‌ను స‌వాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అభిశంస‌న నోటీసును ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు తిరస్క‌రించ‌డం చ‌ట్టవ్య‌తిరేక‌మ‌ని, ఏక‌ప‌క్షంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. జ‌స్టిస్ మిశ్రాపై వెంట‌నే అభిశంస‌న ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని పిటిష‌న్ లో కోరింది. కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యులు ప్ర‌తాప్ సింగ్ బ‌జ్వా, అమీ హ‌ర్ష‌ద్రే యాజ్నిక్ ఈ పిటిష‌న్ దాఖలు చేశారు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దుష్ప్ర‌వ‌ర్త‌ను నిరూపించే ఆధారాలు లేవంటూ వెంక‌య్య నోటీసును తిర‌స్క‌రించ‌డాన్ని వారు స‌వాల్ చేశారు. నోటీసుపై నిర్ణీత సంఖ్య మేర‌కు ఎంపీలు సంత‌కాలు చేసిన త‌ర్వాత దాన్ని ఉపరాష్ట్ర‌ప‌తి తిర‌స్క‌రించ‌డం కుద‌ర‌ద‌ని, ప్ర‌ధాన న్యాయ‌మూర్తిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌కు క‌మిటీని నియ‌మించాల్సిఉంటుంద‌ని వారు త‌మ పిటిష‌న్ లో పేర్కొన్నారు.

పిటిష‌నర్ల త‌ర‌పున కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబాల్ జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ నేతృత్వంలోని బెంచ్ ముందు వాద‌న‌లు వినిపించారు. చీఫ్ జ‌స్టిస్ పై ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన పిటిష‌న్ క‌నుక ఆయ‌న త‌ర్వాత సీనియ‌ర్ అయిన న్యాయ‌మూర్తి దీనిపై నిర్ణ‌యం తీసుకోగ‌ల‌ర‌ని, అత్య‌వ‌స‌రంగా విచార‌ణ‌కు స్వీక‌రించాల‌ని క‌పిల్ సిబాల్ కోరారు. అయితే రోస్ట‌ర్ విధానం ప్ర‌కారం ఈ పిటిష‌న్ ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ముందుకే తీసుకెళ్లాల‌ని జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ సూచించారు. అయితే ఈ పిటిష‌న్ సీజేఐ అభిశంస‌న‌కు సంబంధించిన‌ది గనుక దీన్ని ఆయ‌న ధ‌ర్మాసనం ముందుకు తీసుకెళ్ల‌లేన‌ని క‌పిల్ సిబాల్ తెలిపారు. దీంతో ఈ అంశంపై మంగ‌ళ‌వారం నిర్ణ‌యం తీసుకుంటాన‌ని జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ చెప్పారు.