కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రపంచంలోని సగం దేశాలలో లాక్డౌన్ అమలవుతోంది. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 59,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది మృతిచెందారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధమవుతోంది. వైరస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకు 229,000 మంది కోలుకున్నారు. మరో 7.70 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 39,300 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.
ఐరోపాలోని ఇటలీ, స్పెయిన్‌లో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ఇటలీలో కరోనా మరణాలు ఆగడం లేదు. ఇటలీ, స్పెయిన్లలో రోజుకు వదలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటలీలోనే కోవిడ్ మరణాల సంఖ్య 14,681కు చేరుకోగా… శుక్రవారం మరో 700 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కొత్తగా దాదాపు 3,500 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 119,8272కి చేరింది. అయితే, ఇటలీలో వైరస్ సంక్రమణ నెమ్మదించినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించడం ఊరట కలిగించే అంశం.
అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యధికంగా 2.77 లక్షల కరోనా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. శుక్రవారం మరో 32 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ప్రజల పరిస్థితి దయానీయంగా ఉంది. కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 7,392కు చేరుకుంది.
న్యూయార్క్‌లో వచ్చే కేసులన్నీ పాజిటివ్వే ఉంటున్నాయి. పరీక్షలు చేయడం కష్టంగా ఉందని సిబ్బంది వాపోతున్నారు. ఇంకా 1.65 లక్షల నమూనాలు పరీక్షల కోసం ల్యాబ్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ రాష్ట్రంలో మూడు రోజుల్లో వరుసగా 24 వేలు, 26 వేలు, 29 వేలు.. ఇలా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పరీక్షలను దాదాపు 1.5 మిలియన్ల మందికి నిర్వహించారు..
శుక్రవారం స్పెయిన్‌లో 900 మందికిపైగా మృత్యువాతపడ్డారు. బ్రిటన్‌లో ఒక్కరోజులోనే 569 మంది చనిపోయిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం 4వేల పడకల ఫీల్డ్ ఆసుపత్రిని ప్రారంభించింది. జర్మనీలో కొత్త ఇన్ఫెక్షన్ల రేటు తగ్గింది. దేశంలో మరోసారి ఈ వైరస్ కేసుల సంఖ్య పెరగకుండా చూసేందుకు పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని సింగపూర్ నిర్ణయించింది.