సీనియర్‌ హాకీ జట్టు సభ్యులకు కరోనా పాజిటివ్‌

సీనియర్‌ హాకీ జట్టు సభ్యులకు కరోనా పాజిటివ్‌

భారత హాకీలో కోవిడ్‌–19 కలకలం చెలరేగింది. భారత పురుషుల సీనియర్‌ హాకీ జట్టు సభ్యులు ఐదుగురు కరోనా బారిన పడ్డారు. కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు డిఫెండర్‌ సురేందర్‌ కుమార్, జస్‌కరణ్‌ సింగ్, డ్రాగ్‌ ఫ్లికర్‌ వరుణ్‌ కుమార్, కిషన్‌ పాఠక్‌లకు వైరస్‌ సోకింది. నెల రోజుల విరామం తర్వాత… వీరందరూ తమ స్వస్థలాల నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి హాజరయ్యేందుకు వచ్చారు. వీరందరికీ కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

‘నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. కరోనా నియంత్రణలో భాగంగా ‘సాయ్‌’ వర్గాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను’ అని మన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపాడు. స్వస్థలాల నుంచి బెంగళూరుకు వచ్చే క్రమంలో వీరికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. మన్‌ప్రీత్, సురేందర్‌లో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఈ ఇద్దరితోపాటు మరో పది మంది ఆటగాళ్లు గురువారం ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నారు. ఇతర ఆటగాళ్ల ఫలితాలు రావాల్సి ఉన్నాయి.