లంచం ఇవ్వనిదే పనికాని పరిస్థితి

లంచం ఇవ్వనిదే పనికాని పరిస్థితి

వేతనాలు పెంచుతున్నా.. పీఆర్సీలు ప్రకటిస్తున్నా కొన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతస్థాయి నుంచి దిగువస్థాయి అధికారుల వరకూ లంచం ఇవ్వనిదే పనికాని పరిస్థితి నెలకొంది. దీనికి మూడు నెలల్లో ముగ్గురు అధికారులు పట్టుబడడమే నిదర్శనం. జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కలకలం రేపుతున్నా.. అధికారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. నూతన జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలు, పెరిగిన రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌తో ఏరికోరుకుంటూ పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. చేతుల్లో లంచం పడకపోతే దస్త్రం కదలదంటూ తేల్చి చెబుతున్నారు. ఏసీబీ దాడులు చేస్తున్నా తీరు మారడం లేదు. అదే పనిగా సామాన్యులను పట్టి పీడిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.

ప్రజల నుంచి ఎక్కువగా లంచాలు తీసుకుంటున్న శాఖలపైనే కాకుండా ఆ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపైనా ఏసీబీ అధికారులు ఇక నుంచి సీరియస్‌గా ఆరా తీయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అవినీతి పరుల పక్కా సమాచారాన్ని సేకరించిన తరువాతనే వ్యూహాత్మకంగా దాడి జరిపేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఇటు రెడ్‌హ్యాండెడ్‌ కేసులతోపాటు అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బంది ఆస్తులపై.. వారి బినామీల ఆస్తులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్, ఆర్టీఏ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, మరికొన్ని శాఖల్లో పెరిగిపోతున్న లంచాల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కొంతకాలంగా ఈ శాఖల్లో పెద్దఎత్తున అవినీతి కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

పెద్దపల్లి ఆర్డీవో కె.శంకర్‌కుమార్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 2న కార్పొరేషన్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈ రషీద్‌ను ఏసీబీకి పట్టించిన రజినీకాంత్‌ అనే కాంట్రాక్టరే.. ఆర్డీవోను కూడా పట్టించడం గమనార్హం. గోదావరిఖనికి చెందిన రజినీకాంత్‌కు కరోనా వ్యాప్తి నివారణకు పిచికారీ చేయించిన హైపోక్లోరైడ్‌కు సంబంధించి రూ.9.20 లక్షలు, హరితహారం కింద నాటిన మొక్కల బిల్లు రూ.25లక్షలు రావాల్సి ఉంది. పనులు పూర్తి చేసి ఆర్నెళ్లు గడుస్తున్నా తమకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యే, మేయర్‌కు చెప్పినా ఫలితం కనిపించలేదని, పైగా కమిషనర్‌ లంచం డిమాండ్‌ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు రజినీకాంత్‌ వెల్లడించారు.

కరీంనగర్‌లో భూసేకరణ విభాగంలో పనిచేసిన శంకర్‌కుమార్‌కు జయశంకర్‌భూపాలపల్లి జిల్లాకు బది లీ అయ్యింది. అక్కడకు వెళ్లకుండా పెద్దపల్లికి వచ్చా డు. తహసీల్దార్‌గా పనిచేసిన పలు ప్రాంతాల్లోనూ ఈయనపై అవినీతి ఆరోపణలు అధికంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నారు.జిల్లాలో వరుస ఏసీబీ దాడులతో మిగతా శాఖల ఉద్యోగులు అవినీతికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా పట్టుబడిన ఆర్డీవో ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకుని మరీ లంచం తీసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది. జిల్లాలోని పలుశాఖల్లోని అధికారులు సైతం అదే బాటలో కొనసాగుతున్నారు. పనికోసం వచ్చిన వారిని సెక్షన్‌లో ఫలానా వ్యక్తిని కలవాలని చెబుతున్నారు. మరికొందరు నేరుగా డబ్బు తీసుకోకుండా తమ బినామీల వ్యక్తుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేసి.. దానికి సంబంధించిన బ్యాంక్‌ రిసిప్ట్‌ చూపిస్తే పనులు చేస్తున్నారు. మరికొందరు బంగారం, ఇతరత్రా గిఫ్ట్‌ల రూపంలో ‘మామూళ్లు’ తీసుకుంటున్నారు.