రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సపర్యాలు చేశాడు.. టిఫిన్‌ తీసుకొస్తానని నమ్మించాడు.. కొత్త ద్విచక్ర వాహనాన్ని తీసుకొని ఉండాయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం మండల పరిధి బైరివానిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ స్థానికంగా ఒక ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. దసరా సందర్భంగా స్కూటీని కొనుగోలు చేశారు. చివరి కార్తీక సోమవారం కావడంతో మరో మహిళతో కలిసి వాహనంపై పట్టణంలోని కోటేశ్వరస్వామి ఆలయానికి వెళ్తుండగా.. కొత్తబ్రిడ్జి సమీపంలోని దత్త కోవెల వద్ద వెనుక నుంచి మరో వాహనంతో వేగంగా వచ్చిన వ్యక్తి వీరిని ఢీకొట్టాడు.

ఈ ఘటనలో మహిళ గాయపడగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు సపర్యాలు చేశాడు. ఆటోలో డేఅండ్‌ నైట్‌ జంక్షన్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితురాలు బంధువులు కూడా ఆస్పత్రి వద్దకు స్కూటీని తీసుకొని చేరుకున్నారు. డాక్టర్‌ మందులిచ్చి ఏదైనా తిన్నాక వేసుకోవాలని సూచించారు. దీంతో క్షతగాత్రురాలు టిఫిన్‌ కావాలంటూ సపర్యాలు చేసిన వ్యక్తికి వంద రూపాయలు ఇచ్చారు. అయితే టిఫిన్‌ కొట్టు దూరంగా ఉందని.. బండి ఇవ్వాలని అడగడంతో నిజమేనని నమ్మిన ఆమె తాళం ఇచ్చారు. వాహనాన్ని తీసుకొని వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నం 12 గంటలు దాటినా రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి లబోదిబోమన్నారు. పోలీసులను ఆశ్రయించారు. మహిళకు సపర్యాలు చేసిన వ్యక్తి ఆస్పత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాడు.