పురుషులతో పోల్చితే మహిళలపై మరింత ఎక్కువ

పురుషులతో పోల్చితే మహిళలపై మరింత ఎక్కువ

సంఘ జీవిగా ఉన్న మనిషి తన సహజ ప్రవృత్తికి భిన్నంగా సామాజిక సంబంధాలను కొనసాగించలేకపోవడం మెదడుపై, ఆలోచనల తీరు, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతున్నట్టు వెస్ట్‌మినిస్టర్‌ యూనివర్సిటీ కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ప్రొ.కేథరీన్‌ లవ్‌ డే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కేథరీన్‌ తన పరిశోధనలో.. ఎవరికైనా ఏదైనా చెబుదామనుకుని మరిచిపోయారా?, చదివిన పుస్తకాన్నే మళ్లీ చదువుతున్నారా? వంటి అంశాలతో ‘ప్రతిరోజు జ్ఞాపకశక్తి ప్రశ్నావళి’ ద్వారా వివిధ విషయాలపై పలువురి నుంచి సమాధానాలు రాబట్టారు. తాము బాగా గుర్తుంచుకున్న విషయాల్లో ఏదో ఒక భాగాన్ని మరిచిపోతున్నట్టు ఈ అధ్యయనంలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏదో ఒక ఘటన లేదా చేయాల్సిన పనిని మరిచిపోతున్నట్లు 55 శాతం మంది వెల్లడించారు.

మహమ్మారి కారణంగా తలెత్తిన పరిణామాలతో మెదడు పనితీరు, ఆలోచనలు కూడా ఏదో ఒకరూపంలో ప్రభావితమైనట్లు 30 శాతం మంది పేర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితుల ప్రభావం మహిళలపై మరింత ఎక్కువగా పడినట్లు, పురుషులతో పోల్చితే వారి జ్ఞాపకశక్తి ఎక్కువ తగ్గినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. కాగా, కోవిడ్‌ మహమ్మారి మనుషుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సైకాలజిస్ట్‌ విశేష్‌ పేర్కొన్నారు. ఆప్తులతో మనసారా మాట్లాడలేకపోవడం, అభిప్రాయాలు, ఆలోచనల మార్పిడి లేకపోవడంతో వ్యక్తిత్వం, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం మనుషుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై సుదీర్ఘకాలం పాటు ఉంటుందని వివరించారు.