ఉప్పాడ-3 సచివాలయం పరిధిలో పనిచేస్తున్న మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురామ్‌పై వాకతిప్ప గ్రామానికి చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కొత్తపల్లి మండల జడ్పీ టీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావు తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడడం చర్చనీయాంశమైంది. ఇదే మండలంలోని కోనపాపపేట పైపులైన్ల వ్యవహారంపై కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులు సోమవారం మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు.
సమీక్ష అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో మత్స్యశాఖ, కర్మాగారాలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల జిల్లా అధికారుల సమక్షంలోనే వైకాపా నాయకుడు, ఆయన అనుచరులు మత్స్య శాఖ సహాయకుడిపై దాడికి పాల్ప డ్డారు. అతని చొక్కా పట్టుకుని ఈడ్చు కెళ్లారు. ఆయనను కొట్టవద్దని, వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్య నారాయణ వారిస్తూ.. ఏమైనా ఉంటే ఉన్న తాధికారులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నా చిన్నారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దాడి చేయాలని అనుచరులను ఉసిగొల్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళుతుంటే.. అనుచరులు పిడిగుద్దులు కురిపించారు.