ఢిల్లీలో అత్తామామలను చంపిన కోడలు…

ఓ పక్క కరోనా వైరస్ కలకలం రేపుతుంటే మరో పక్క హత్యలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ ఢిల్లీలో అత్తమామలను చంపేసింది ఓ కోడలు. ఓ వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారని తెలుసుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ హత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిందితులను అదుపులోకి పోలీసులు కేసును విచారిస్తున్నారు.

అయితే పశ్చిమ ఢిల్లీలోని దుర్గా విహార్ ప్రాంతంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధ దంపతులు రాజ్‌ సింగ్‌, ఓంవతి నివసిస్తున్నారు. నిన్న ఒకే మంచంపైన ఆ వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించడంతో తమకు స్థానికులు సమాచారం అందించారని.. మృతుల ముఖాల మీద గాయాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.అంతేకాకుండా విచారణలో భాగంగా వారిని కోడలు కవిత హత్య చేసినట్లు తేలిందని కూడా తెలిపారు. ఈ హత్యలకు ఆస్తి వివాదమే కారణమని కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా తన భర్త సతీశ్‌ సింగ్ ఎదుటే ఆమె అత్తమామలను చంపిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ హత్య జరిగిన సమయంలో కవిత భర్తతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా అదే గదిలో ఉన్నట్లు సమాచారం అందుతుంది.