కోహ్లికి అవకాశం ఇచ్చిన ధోని

కోహ్లికి అవకాశం ఇచ్చిన ధోని

టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని.. మంచి ఫినిషర్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా ఓడిపోతుందనుకున్న చాలా మ్యాచ్‌ల్లో ధోని తనదైన ఫినిషింగ్‌తో గెలిపించేవాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరిబంతికి విన్నింగ్‌ షాట్‌ కొట్టి భారత అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అలాంటి ధోని క్రీజులో ఉన్నాడంటే అవతలి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వడం అరుదుగా చూస్తుంటాం. కానీ 2014 టీ20 ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్‌ షాట్‌ కొట్టే అవకాశం కోహ్లికి ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 18.3 ఓవర్‌ బంతికి 167 పరుగుల వద్ద రైనా అవుటయ్యాడు. కోహ్లి 78 పరుగులతో అజేయంగా ఉన్నాడు.

భారత్‌ విజయానికి ఇంకా 8 బంతుల్లో 2 పరుగలు కావాలి. ఓవర్‌ 5వ బంతి ఆడిన కోహ్లి సింగిల్‌ తీశాడు. స్ట్రైకింగ్‌లోకి వచ్చిన ధోనిని విన్నింగ్‌ షాట్‌ కొట్టమన్నట్లుగా కోహ్లి అతని వైపు నవ్వుతూ పేర్కొన్నాడు. కానీ ధోని అనూహ్యంగా ఆ బంతిని డిఫెన్స్‌ ఆడాడు. అయితే కోహ్లి రన్‌ కోసమని ముందుకు పరిగెత్తాడు.. కానీ ధోని స్పందించలేదు. ధోని ఇదేంటి.. అన్నట్లు కోహ్లి అతనివైపు కోపంగా చూశాడు. ఆ తర్వాత ఓవర్‌ తొలి బంతికే ఫోర్‌ కొట్టిన కోహ్లి టీమిండియాను గెలిపించాడు.

విజయం అనంతరం మైదానం వీడుతున్న తరుణంలో కోహ్లి ధోని దగ్గరికి వెళ్లి ఎందుకలా చేశావని ప్రశ్నించాడు.’నువ్వు విన్నింగ్‌ షాట్‌ ఆడాలనే అలా చేశా.. కేవలం నీ కోసమే కోహ్లి’ అంటూ ధోని పేర్కొన్నాడు. తాజాగా ఈ వీడియోనూ ఐసీసీ మరోసారి ట్విటర్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల చేసింది.

డుప్లెసిస్‌ 58 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ 3 వికెట్లు తీశాడు. అనంతర బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టులో విరాట్‌ కోహ్లి 44 బంతుల్లోనే 72 పరుగులు చేయడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం పాలై రెండోసారి టీ20 ప్రపంచకప్‌ సాధించే సువర్ణావకాశాన్ని కోల్పోయింది.