బీజేపీ విషయంలో జగన్ కి జ్ఞానోదయం అయిందా ?

Did jagan clarity on bjp over alliance

ఏపీలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా బీజేపీకి మద్దతిచ్చి జెండాని మోసేందుకు సిద్దమయిన జగన్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది. నిన్న రాత్రి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ వద్ద పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కీలక నేతల, ప్రాంతీయ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వకూడదని నిర్ణయించింది. దీనికి కారణం ఏమిటంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమట. నాలుగేళ్లుగా బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలుపుతు వస్తున్న జగన్ పార్టీ ఒక్కసారిగా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఎందుకు గుర్తొచ్చిన్న లాజిక్ ఏపీ రాజకీయవర్గాలకు ప్రస్నార్ధకంగా మారింది. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అసలు బీజేపీ మద్దతు అడగను కూడా అడగకుండానే బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చింది వైసీపీ. బీజేపీ నుండి తమకు పిలుపు రాకపోవడం తో వైసీపీ అధినేత జగన్.. అత్యంత రహస్యంగా… ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ తీసుకుని కలసి మరీ మరో షరతు లేకుండా మద్దతు ప్రకటించారు.

జగన్ మద్దతు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేకహోదా ఇవ్వలేమని ప్రకటించింది. అయినా ప్రధానితో ఏదో విధంగా మాట్లాడుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా రప్పిద్దాం అని అనుకుంటున్నా సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు వైసీపీ ఎలాంటి షరతులు పెట్టకుండా మద్దతు ఇచ్చింది. మోడీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలో ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ అనేక అంశాల్లో పార్లమెంట్ బయట, లోపలా అనేక సార్లు ఆందోళనలు చేశాయి. కానీ ఆ ఆందోళనలలో ఎక్కడా వైసీపీ కనిపించలేదు. జీఎస్టీ, నోట్ల రద్దులాంటి విషయాల్లో బీజేపీపై ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం చేయలేదు.కానీ ఇప్పుడు అనూహ్యంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల కోసం మాత్రం బీజేపీకి మద్దతివ్వకూడదని నిర్ణయించారు. ఈ పరిణామాన్ని పరిశీలిస్తే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడదల్చుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో అంటకాగినట్లు కనిపించకుండా ఉండాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించాలి కాబట్టి ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం బీజేపీని వ్యతిరేకించాలని భావిస్తున్నట్టున్నారు. అయితే ఇక్కడే వైసీపీకి మరో మైనస్ కనపడుతోంది, ఇన్నిరోజులు అన్ని విషయాల్లో చంద్రబాబును విమర్శిస్తూ వచ్చిన వారికి బాబును విమర్శించే అవకాశం చేజారచ్చు !