అన్న క్యాంటీన్ల మెనూ చూశారా ?…హోటల్ కి ఏమాత్రం తీసిపోకుండా !

Anna canteen menu
Anna canteen menu

పేద‌వాడి కడుపు నింపడమే ప్రధాన ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 60 క్యాంటీన్లు ప్రారంభించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 203 క్యాంటీన్ల అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని ప్రభుత్వం రూ.15కే అందిస్తోంది. క్యాటరింగ్ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. ప్రతి క్యాంటీన్ లో రోజుకు 250-300 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారు. అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ మందికి ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోనున్నారు.

తాజాగా ఈ క్యాంటీన్ల ద్వారా అందించే అల్పాహారం, భోజన పట్టికను ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ మెన్యూ అమల్లోకి రానుంది. అల్పాహారంలో భాగంగా ప్రతి రోజు ఇడ్లీ, పొడి, సాంబారు కచ్చితంగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం పూరి, కుర్మా ఉంటుంది. మంగళవారం ఉప్మా, బుధవారం పొంగల్, గురువారం పూరి, శుక్రవారం ఉప్మా, శనివారం పొంగల్ ఉంటుంది. అల్పాహారం ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు లభిస్తుంది. ఇడ్లీ, పూరి మూడు చొప్పున ఇస్తారు. ఉప్మా, పొంగలి 250 గ్రాములు పంపిణీ చేస్తారు.

భోజనం మాత్రం వారం రోజులు ఒకేలా ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అందించే భోజనంలో రైస్, కూర, పప్పు, సాంబారు. పెరుగు, పచ్చడిని పంపిణీ చేస్తారు. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు… రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కరికి 400 గ్రాముల అన్నం అందిస్తారు. ఆదివారం అన్నా క్యాంటీన్లకు సెలవును ప్రకటించారు.