Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆయన బయోపిక్ కు దర్శకత్వం వహించే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని దర్శకుడు క్రిష్ సంతోషం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద క్రిష్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించాలని బాలకృష్ణ అడిగినప్పుడు తొలుత భయపడ్డానని, ఆ తర్వాత ఇది తనకు దక్కిన మహాభాగ్యంగా అనిపించిందని అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను దృశ్యకావ్యం రూపంలో తెలుగుజాతికి అందించే అవకాశాన్ని తనకు కల్పించిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ గొప్పవ్యక్తని, ఆయన బయోపిక్ విషయంలో బాలయ్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కబోయే ఎన్టీఆర్ కు తొలుత దర్శకుడిగా తేజను అనుకున్నారు. ఆయన దర్శకత్వంలో ముహూర్తపు షాట్ కూడా చిత్రీకరించారు. అయితే ఎన్టీఆర్ కు న్యాయం చేయలేననే ఉద్దేశంతో సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు తేజ ప్రకటించారు. అప్పటినుంచి అనేకమంది దర్శకుల పేర్లు వినిపించాయి. బాలకృష్ణే స్వయంగా డైరెక్ట్ చేస్తారన్న వార్తలూ వచ్చాయి.
అయితే ఎన్టీఆర్ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తారని ఆదివారం బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. నాటి రాముడి కథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలైన మేము చెబుతున్నాము. చేసే ప్రతిపనిలో ప్రాణముంటుంది. ప్రతి ప్రాణానికీ ఓ కథ ఉంటుంది. ఈ కథ ఎవరు చెప్పాలని రాసి పెట్టి ఉందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలిచిన క్రిష్ జాగర్లమూడి ఈ చరితకు చిత్ర రూపాన్నిస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను అని బాలకృష్ణ ప్రకటించారు.