న్యాయం చేయాలని సీఎం ని కోరిన దివ్య తల్లిదండ్రులు

న్యాయం చేయాలని సీఎం ని కోరిన దివ్య తల్లిదండ్రులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని వంకాయలపాటి దివ్య తేజస్విని హత్య కేసుకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్‌.. దివ్య తల్లిదండ్రులు జోసెఫ్‌, కుసుమ, దివ్య సోదరుడు దినేష్‌లను స్వయంగా సీఎం జగన్‌ వద్దకు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌కు తమకు తన కూతురికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ కేసులో తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎం జగన్‌కు అందజేశారు.

కాగా, సీఎం జగన్‌ను కలిసే ఏర్పాటు చేయాలని రెండ్రోజుల క్రితం పరామర్శించడానికి వెళ్లిన హోం మంత్రి మేకతోటి సుచరితను దివ్య కుటుంబ సభ్యులు అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్‌ను కలిసేందుకు హోం మంత్రి ప్రత్యేకంగా చొరవ చూపారు.

కాగా, విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజస్విని (22)పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. పక్కా స్కెచ్ వేసి మరీ దివ్యను నాగేంద్ర హతమార్చినట్లు పోలీసు విచారణలో తెలిసింది. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.