ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం వేళ.. ఈజిప్టు అధ్యక్షుడితో ఫోన్‌లో మోదీ చర్చలు

National Politics: Prime Minister's key instructions at the time of inauguration of Ayodhya Ramaya statue
National Politics: Prime Minister's key instructions at the time of inauguration of Ayodhya Ramaya statue

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజాపై రెండో దశ యుద్ధాన్ని చేస్తోంది. కాల్పులు విరమించుకునే సమస్యలే లేదని తేల్చి చెబుతోంది. ప్రాణాలతో బతికి బట్టకట్టాలంటే వెంటనే పౌరులంతా గాజా నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తోంది. హమాస్ శిబిరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. ఆ దళాలను సమూలంగా నాశనం చేసే వరకు యుద్ధం ఆపేదే లేదని తేల్చి చెప్పింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం.. ఆ యుద్ధంలో చిన్నారులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం చూసి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు చర్చలతో ఈ సమస్య పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఈ ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌ సిసితో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఫోన్​లో సంభాషించారు. ఈ మారణహోమంలో సామాన్య పౌరులు మరణిస్తున్నారని ఇరు దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫోన్ సంభాషణలో హింస, పౌరుల మృతిపై చర్చించినట్లు మోదీ తన ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. పశ్చిమాసియాలో దిగజారుతున్న భద్రత, మానవతా పరిస్థితిపై ఈజిప్టు అధ్యక్షుడితో తన అభిప్రాయాలు షేర్ చేసుకున్నట్లు ట్వీట్​లో పేర్కొన్నారు.

శాంతి, స్థిరత్వం, మానవతా సాయానికి అవకాశం కల్పించాలనే అంశాలపై భారత్​తో ఈజిప్టు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మోదీ తెలిపారు. మరోవైపు.. గాజా పట్టీపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపైనే.. మోదీతో చర్చించినట్లు ఈజిప్టు అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఈజిప్టు చేస్తున్న ప్రయత్నాన్ని మోదీకి వివరించినట్లు తాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.