అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం

అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం

అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ ఆఫ్గన్‌లో చోటుచేసుకున్న వరుస భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. పశ్చిమ అఫ్గన్‌లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం వచ్చింది. బాద్గీస్‌ పశ్చిమ ప్రావిన్సులోని ఖాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడటంతో 26 మంది మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ పేర్కొన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. చాలామంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనటట్లు యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. అయితే ప్రావిన్స్‌లోని ముఖ్ర్ జిల్లాలో కూడా భూకంపం సంభవించిందని కానీ అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సర్వారీ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే అఫ్గనిస్తాన్‌ తీవ్ర విపత్తులో చిక్కుకుంది. గత ఏడాది ఆగష్టులో దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా భూకంపాలతో అఫ్గన్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్క పడ్డారు. ఇక తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత అఫ్గన్ ఎదుర్కొన్న తొలి ప్రకృతి విపత్తు ఇదే కావడం గమనార్హం.