ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల..!

AP Politics; EC team met with officials in AP.. Review of election preparations
AP Politics; EC team met with officials in AP.. Review of election preparations

దేశంలో త్వరలోనే ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాలకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్‌ నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు జరగొచ్చని తెలుస్తోంది.

2018 శాసనసభ ఎన్నికల మాదిరి.. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడత… ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌ తేదీలు మాత్రం 5 రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని.. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 10 నుంచి 15వ తేదీ మధ్య ఉండొచ్చని సమాచారం. మిజోరం శాసనసభ గడువు డిసెంబర్‌ 17తో ముగియనుండగా, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి.

కేంద్ర ఎన్నికల సంఘం అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంపై దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో పర్యటించి.. అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపింది.