ఏప్రిల్ 30 వరకు ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వాలన్న కేంద్ర కార్మిక శాఖ

ఏప్రిల్ 30 వరకు ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వాలన్న కేంద్ర కార్మిక శాఖ

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో దాదాపు అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడింది. వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు పోతాయేమోనని, వేతనాల్లో కోత ఉండొచ్చని భయపడుతున్నారు.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఉద్యోగులకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగులకు రిలీఫ్ అందించాలని కేంద్ర కార్మిక శాఖ తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలకు కోరింది. కేవలం కార్మిక శాఖ మాత్రమే కాకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మెమోరాండమ్‌ను జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వంలో కూడా కొంత మంది కాంట్రాక్ట్ కింద పనిచేస్తూ ఉంటారు. అలాగే ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్ కూడా ఉండొచ్చు. వీరందరూ కోవిడ్ 19 వల్ల ఆఫీస్‌లకు రాలేకపోతున్నారు. దీంతో జీతంలో కటింగ్స్ ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు. అయితే ఆర్థిక శాఖ వీరికి శుభవార్త అందించింది. లాక్‌డౌన్ వల్ల ఆఫీస్‌లకు రాని వారికి ఆన్ డ్యూటీ కింద పరిగణిస్తామని పేర్కొంది. అందరికీ వేతనాలు సక్రమంగానే అందుతాయని తెలిపింది. ఏప్రిల్ 30 వరకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.

ఇక కార్మిక శాఖ ఉద్యోగులను తొలగించవద్దని, మరీముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులును జాబ్స్ నుంచి తీసేయొద్దని, వారి వేతనాల్లో కోత విధించొద్దని కంపెనీలను కోరింది. కరోనా వైరస్ వల్ల సమాజానికి పెద్ద సమస్య ఎదురైందని, దీన్ని ఎదుర్కోవాలంటే అందరి సహకారం అవసరమని తెలిపింది.కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30 వరకు ఉద్యోగులు ఎవరైనా లీవ్ తీసుకున్నా కూడా వారిని ఆన్‌డ్యూటీ కిందనే పరిగణించాలి. వేతనంలో ఎలాంటి కటింగ్స్ ఉండకూడదు.