రిసార్ట్ రాజ‌కీయాల‌పై సుప్రీంకోర్టులోనూ హాస్యోక్తులు

Even owners of resorts politics are locked out, SC jokes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

క‌ర్నాట‌కంలో కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ చేస్తున్న రాజ‌కీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. మెజార్టీ సభ్యుల బ‌ల‌మున్న కాంగ్రెస్-.జేడీఎస్ ను కాద‌ని గ‌వ‌ర్న‌ర్ బీజేపీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం, య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డంపై రాజ‌కీయ‌ప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తోంటే సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని, బీజేపీ వైఖ‌రిని త‌ప్పుబ‌డుతూ అనేక కామెంట్లు వెలువుడుతున్నాయి. బీహార్, గోవా త‌దిత‌ర రాష్ట్రాల్లో బీజేపీ వ్య‌తిరేక‌ప‌క్షాలు క‌ర్నాట‌క సూత్రం ప్ర‌కారం ప్ర‌భుత్వం ఏర్పాటుచేసేందుకు అవ‌కాశ‌మివ్వాల‌ని కోరుతూ వార్త‌ల్లో నిలుస్తున్నాయి. అదే స‌మ‌యంలో రిసార్ట్ రాజ‌కీయాల‌పైనా దేశంలో చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. బీజేపీ త‌మ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ పెడుతుంద‌న్న భ‌యంతో ఫ‌లితాలు విడుద‌ల‌యిన ద‌గ్గ‌ర‌నుంచి కాంగ్రెస్, జేడీఎస్ త‌మ ఎమ్మెల్యేల‌ను బెంగ‌ళూరులోని ఈగ‌ల్ట‌న్ రిసార్టుకు త‌ర‌లించాయి. ఎమ్మెల్యేల‌ను ఇలా రోజుల త‌ర‌బ‌డి రిసార్టుల్లో, హోట‌ళ్ల‌లో ఉంచ‌డంపై నెటిజ‌న్లు జోకులు పేల్చుకుంటున్నారు. సామాన్య ప్ర‌జ‌లే కాదు…సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు సైతం ఈ సెటైర్లతో ఎంజాయ్ చేస్తున్నారు.

క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారాన్ని వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ నేత‌లు వేసిన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా రిసార్ట్ రాజ‌కీయాల‌పై జోక్ పేలింది. కాంగ్రెస్ పిటిష‌న్ ను శుక్ర‌వారం జ‌స్టిస్ ఏకె. సిక్రితో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది. ఎంతో సీరియ‌స్ గా ఇరువైపులా వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ఎవ‌రికి మ‌ద్ద‌తుగా తీర్పు వ‌స్తుందా అని అంద‌రూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ స‌మ‌యంలో జ‌స్టిస్ ఏకె.సిక్రి ఒక్కసారిగా వాట్సాప్ జోక్ పేల్చారు. మాకు ఇప్పుడే ఓ వాట్సాప్ సందేశం వ‌చ్చింది. మా ద‌గ్గ‌ర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు….న‌న్ను సీఎం చేయండి అంటూ హోటల్ య‌జ‌మాని సందేశం పంపించాడు..అని జ‌స్టిస్ సిక్రి జోక్ వేశారు. దీంతో ఒక్క‌సారిగా కోర్టు ప్రాంగ‌ణ‌మంతా న‌వ్వుల‌తో నిండిపోయింది. రిసార్ట్ రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావిస్తూ న్యాయ‌మూర్తి ఈ విధంగా జోక్ చేశారు. మొత్తానికి క‌ర్నాట‌క వ్య‌వ‌హారం గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది.