ఎమ్మెల్యేను చంపిన దుండగులు

ఎమ్మెల్యేను చంపిన దుండగులు

భూవివాదం నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మాజీ ఎమ్మెల్యేను ప్రత్యర్థులు కొట్టి చంపారు. లకీంపూర్‌ ఖేరీలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్‌ మిశ్రా తన కుమారుడితో కలిసి వెళ్తున్న సమయంలో త్రికోలియా బస్టాప్‌ వద్ద కాపుగాసిన దుండగులు వారిపై కర్రలతో దాడికి దిగారు. గాయాలపాలైన నిర్వేంద్ర కుమార్‌ని, ఆయన కుమారుడు సంజీవ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. నిర్వేంద్ర కుమార్‌ ప్రాణాలు విడిచారు.

మాజీ ఎమ్మెల్యే మృతితో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపూరన్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. కాగా, దుండగులు తోసేయడంతోనే మాజీ ఎమ్మెల్యే గాయాలపాలై మరణించారని జిల్లా ఎస్పీ చెప్పారు. నిజానిజాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుస్తాయని అన్నారు. భూవివాదం కారణాలతో ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిర్వేంద్ర కుమార్‌ మిశ్రా పలియా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలాఉండగా.. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌కుమార్‌ లల్లూ విమర్శించారు.