ఫేస్ బుక్ కు కొత్త చిక్కులు…

Facebook collecting user information from texts and photos,data

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డేటా దుర్వినియోగం కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌క‌ముందే ఫేస్ బుక్ కు మ‌రో స‌మ‌స్య ఎదుర‌యింది. కాలిఫోర్నియాకు చెందిన సిక్స్ 4త్రీ అనే స్టార్ట‌ప్ సంస్థ ఫేస్ బుక్ కు వ్య‌తిరేకంగా ఓ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఖాతాదారుల వ్య‌క్తిగ‌త సందేశాలు, వారి ఫొటోల‌పై ఫేస్ బుక్ నిఘా పెట్టింద‌ని, అనేక యాప్ ల ద్వారా యూజ‌ర్ల స‌మాచారం సేక‌రిస్తోంద‌న్న‌ది సిక్స్ 4త్రీ ఆరోప‌ణ‌. ఫేస్ బుక్ త‌న యాప్స్ నుంచి యూజ‌ర్లు, వారి స్నేహితుల ఫొటోలు తీసుకోవ‌డం, సందేశాలు చ‌ద‌వ‌డం చేస్తోంద‌ని, వాళ్లు ఎక్క‌డ ఉంటున్నార‌నేదానికి సంబంధించి లొకేష‌న్స్ తెలుసుకుంటోంద‌ని త‌న పిటిష‌న్ లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఆధారాల‌ను ఆ కంపెనీ న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను ఫేస్ బుక్ ప్ర‌తినిధి ఒక‌రు ఖండించారు.

వినియోగ‌దారుల అనుమ‌తి లేకుండా తాము ఎలాంటి డేటాను తీసుకోబోమ‌ని స్ప‌ష్టంచేశారు. మార్చి నెల‌లో యూజ‌ర్ల అనుమ‌తి తీసుకుని వాళ్ల కాల్స్, సందేశాల‌కు సంబంధించిన స‌మాచారం తీసుకున్న‌ట్టు ఫేస్ బుక్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. 2016లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో డొనాల్డ్ ట్రంప్ కోసం ప‌నిచేసిన కేంబ్రిడ్జి అన‌లిటికా ఫేస్ బుక్ ఖాతాదారుల స‌మాచారాన్ని దొంగ‌లించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. దీనిపై ఫేస్ బుక్ సీఈవో జుక‌ర్ బ‌ర్గ్ క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ సాగుతోంది. ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే…ఫేస్ బుక్ కు మ‌రో స‌మ‌స్య ఎదుర‌వ‌డం..చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది.