వంటగదిలో ఉరి వేసుకుని తండ్రి మృతి

వంటగదిలో ఉరి వేసుకుని తండ్రి మృతి

కాకినాడ అర్బన్‌ పరిధి రాజేశ్వరి నగర్‌కు చెందిన వల్లభాపురపు దుర్గాప్రసాద్‌ (53), వెంకట పద్మావతి (45) దంపతులు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి పడక గదిలో సీలింగ్‌కు చీరతో వెంకట పద్మావతి, వంట గదిలో సీలింగ్‌ హుక్‌కు చీరతో దుర్గాప్రసాద్‌ ఉరివేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై బెంగళూరులో ఉంటోంది. చిన్న కుమార్తె రాధిక బీటెక్‌ చదువుతూ ఇంటివద్దే ఉంటోంది. ఆదివారం ఇంద్రపాలెంలోని అమ్మమ్మ ఇంటికి రాధిక వెళ్లింది.

ఆ రాత్రి భార్యభర్తలిద్దరే ఇంట్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 సమయంలో తల్లిదండ్రులకు రాధిక తన అమ్మమ్మ ఇంటి నుంచి ఫోన్‌ చేయగా సమాధానం రాలేదు. దీంతో ఆమె ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా తల్లి ఉరి వేసుకుని కనిపించింది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తెరచి లోపలికి వెళ్లి చూడగా వంటగదిలో తండ్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సర్పవరం ఎస్సై కృష్ణబాబు, సిబ్బంది శవ పంచానామాలు నిర్వహించారు.

రాధిక ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. ఏడాదిగా తండ్రి ఖాళీగా ఇంటి వద్దే ఉండడంతో తరచూ తల్లిదండ్రులు గొడవ పడేవారని, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని రాధిక పోలీసులకు తెలిపింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.