దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు

దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు

దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ఢిల్లీ హడలెత్తిపోతుంది. నిన్న ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే ఈరోజు ఒక షూ కంపెనీలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం నరేనా పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. పక్కనే ఉన్న మరో పరిశ్రమకు కూడా మంటలు వ్యాపించినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. షూ ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 22 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ మంటలను అదుపులోకి తీసుకొనిరావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నిన్న ఉదయం ఢిల్లీలోని ఖిరారీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా తొమ్మిది మంది మృతి చెందారు. మృతి చెందిన 9మందిలో ముగ్గురు పిల్లలు ఉండటం గమనార్హం. ఈ ఘటన మరవకముందే ఈరోజు నరేనా ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వరుస అగ్నిప్రమాదాలు ఢిల్లీవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 9వ తేదీన కూడా ఢిల్లీలోని ఒక ప్లాస్టిక్ సంచులు తయారు చేసే ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని ఫ్యాక్టరీల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వలనే వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సమాచారం. అగ్నిప్రమాదాలు సంభవిస్తూ ఉండటంతో భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. అధికారులు ఫ్యాక్టరీలలో తనిఖీలు చేసి సరైన భద్రతాప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.