మామిడిపండ్లు ఎక్కువగా తింటున్నారా

మామిడిపండ్లు ఎక్కువగా తింటున్నారా

వేసవి అనగానే చాలా మంది కొన్ని ఆహార పదార్థాల కోసం ఎదురుచూస్తారు. చల్లని ఐస్‌క్రీమ్స్, జ్యూస్‌లు, మామిడిపండ్లు చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంతా అవుతోంది. కానీ, వీటన్నింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.అదే విధంగా ఈ సీజన్‌లో వీలైనంత వరకూ నాన్‌వెజ్‌కి దూరంగా ఉండడం చాలా మంచిది.

ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఉండే నూనె జీర్ణ సమస్యలకి కారణమవుతుంది. అంతేనా.. చర్మాన్ని జిడ్డుగా మార్చుతుంది. ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో ఎక్కువగా వేడి పుట్టి చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో బాడీ డీహైడ్రేషన్‌కి గురవుతుంది.మసాలా ఐటెమ్స్‌ని వీలైనంత వరకు తగ్గించాలి. వీటిని తినడం వల్ల శరీరంలో ఎక్కువగా వేడి ఉత్పత్తి అవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

సీజన్ రాగానే చాలా మంది మామిడిపండ్లని ఇష్టంగా తింటారు. కేజీల కొద్దీ తెచ్చుకుని వాటిని ఆస్వాదిస్తారు. ఏమైనా అంటే ఈ సీజన్‌లోనే వీటిని తింటాం. మిగతా సీజన్‌‌లో దొరకవుగా అంటూ సమాధానమిస్తారు. అయితే సీజన్ వారీగా పండ్లు తినడం మంచిదే. కానీ, దొరుకుతాయి కదా అని మామిడిపండ్లు ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, అజీర్తి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అంతేనా.. ఇందులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు పెరిగే అవకాశం అధికంగా ఉంది. అందువల్ల ఎంత ఇష్టమున్నప్పటికీ ఈ పండ్లని ఎంత తక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది.

కాఫీ, టీలకు అలవాటు పడిన వారు వాటిని వదల్లేక ఉండలేరు. వీటిని అధికంగా తీసుకుంటారు. అయితే వీటిని తీసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇందులోని కెఫీన్ లాంటి పదార్థాలు శరీరంలో నీటి స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి వీటికి కూడా దూరముంటే చాలా మంచిది.

చాలా మంది ఎండను తట్టుకోలేక బయటికి వెళ్ళినప్పుడు ఐస్‌క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇవి అప్పటికప్పుడు చల్లదనాన్ని ఇచ్చినా వీటివల్ల కలిగే నష్టం అధికంగా ఉంటుంది. ఒకేసారి వీటిని తీసుకోవడం వల్ల వేడి కలిగే నష్టం ఉంది. అంతేకాకుండా.. శరీరంలో వేడి ఉత్పత్తయ్యే అవకాశం ఉంది.