దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారా ?

Gang-robbery in Venkatadri Express

కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్ళే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పై నిన్న రాత్రి దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. రైలు సిగ్నల్ కేబుల్స్ ను కట్ చేయడం ద్వారా రైలు ఆగేలా చేసిన దొంగలు, రైల్లోకి చొరబడి బీభత్సం సృష్టించారని తెలుస్తోంది. ప్రయాణికుల నుంచి నగదు, నగలు, విలువైన వస్తువులను అపహరించారు. గుత్తి డివిజన్‌ పరిధిలోని రాయల్‌చెరువు సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులపై దాడి చేసిన దుండగులు వారి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, రూ. 10వేల నగదును ఎత్తుకెళ్లారు. దుండగులను ఎదిరించే క్రమంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పక్క బోగీలోనే పోలీసులు ఉన్నా విచ్చలవిడిగా దోపిడీ చేశారు. తమకు ఎదురు తిరిగిన వారిని చావగొట్టారు. కత్తులు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేశారు. ఎస్‌2, ఎస్‌12 బోగీల్లో దోపిడి జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో 12 మంది దొంగలు పాల్గొన్నారని, పోలీసులు లేని బోగీలను ముందుగానే ఎంచుకుని, రైలు ఆగిన నిమిషాల్లోనే పని ముగించుకుని చీకట్లోకి పారిపోయారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా నడికుడి జంక్షన్ సమీపంలో కూడా సిగ్నల్ ను పనిచేయకుండా చేసిన దొంగలు దోపిడీకి దిగగా, అదే గ్యాంగ్ ఈ ఘటనలోనూ పాల్గొని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సిగ్నల్స్ లేకుండా చేసి ట్రైన్ ఆగాక దోపిడీ చేయడం చూస్తుంటే ఈ ముటాలో ఎవరయినా రైల్వే ఉద్యోగులు, లేదా సిగ్నలింగ్ వ్యవస్థల మీదపట్టున్న వ్యక్తులే చేస్తున్నట్టు అర్ధం అవుతోంది. మరో పక్క దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారని అనుకుంటున్నారు.