సచిన్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన గంగూలీ

సచిన్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన గంగూలీ

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ ఆడిన రోజుల్లో ఎప్పుడైనా అతనిలో కోపం చూసిన క్షణాలు చాలా అరుదు. ఎటువంటి వివాదాలు, ఎటువంటి హెచ్చరికలు లేకుండానే సచిన్‌ తన క్రీడా జీవితాన్ని ఆస్వాదించాడు. అయితే సచిన్‌ టెండూల్కర్‌ ఆగ్రహాన్ని తాను చూశానని అంటున్నాడు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ. భారత జట్టుకు సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోప పడటమే కాకుండా తనకు వార్నింగ్‌ కూడా ఇచ్చాడని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ఇటీవల సచిన్‌ టెండూల్కర్‌ 48వ ఒడిలోకి అడుగుపెట్టిన సందర్భంలో అతనితో ఉన్న కొన్ని జ్ఞాపకాలను గంగూలీ షేర్‌ చేసుకున్నాడు.

1997 వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్‌ గెలవాల్సిన ఒక టెస్టు మ్యాచ్‌ను కోల్పోవడంతో గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేశాడట సచిన్‌. ‘ ఆనాటి మూడో టెస్టులో విండీస్‌ తమకు 120 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. ఇది చాలా స్పల్ప లక్ష్యం. కానీ మేము 81 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయ్యాం. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయాం. ఫలితంగా సిరీస్‌ను విండీస్‌ గెలుచుకుంది. గెలుపు అంచుల వరకూ వెళ్లి ఓడిపోవడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో సచిన్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ క్రమంలోనే సచిన్‌ తన కోపాన్ని నాపై చూపాడు. ప్రతీ రోజూ మైదానం చుట్టూ పరుగెత్తితేనే భవిష్యత్తు ఉంటుందని హెచ్చరించాడు. నువ్వు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే రోజూ ఉదయమే పరుగెత్తాల్సిందే అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇది నాకు కరెక్టే అనిపించింది’ అని గంగూలీ తెలిపాడు.