జ‌న‌గ‌ణ‌మ‌న‌కు లేచినిల్చోవ‌డం క‌ష్ట‌మా..?

gautam gambhir comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశ‌భ‌క్తిని రుజువుచేసుకోవ‌డానికి సినిమాహాళ్ల‌ల్లో జ‌న‌గ‌ణ‌మ‌న వ‌స్తున్న‌ప్ప‌డు లేచి నిల్చోవాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని క‌మ‌ల్ హాస‌న్, అర‌వింద‌స్వామి స‌మ‌ర్థించ‌గా…ప్ర‌ముఖ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ మాత్రం ప‌రోక్షంగా వ్య‌తిరేకించారు. క్ల‌బ్ కు వెళ్తే సుమారు 20 నిమిషాలు బ‌య‌ట ఎదురుచూస్తామ‌ని, రెస్టారెంట్ కు వెళ్తే..30 నిమిషాల‌పాటు బ‌య‌ట నిల్చుంటామ‌ని, మ‌రి జాతీయ‌గీతం కోసం 52 సెకండ్ల పాటు నిల్చోలేమా అని గంభీర్ ప్ర‌శ్నించారు. దేశ‌భ‌క్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు థియేట‌ర్స్ లో సినిమా మొద‌ల‌య్యే ముందు జాతీయ గీతాన్ని ప్ర‌సారం చేయాల‌ని, ఆ స‌మ‌యంలో ప్రేక్ష‌కులంతా లేచి నిల్చోవాల‌ని గ‌త న‌వంబ‌రు లో సుప్రీంకోర్టు ఆదేశించింది.
అప్ప‌టినుంచి దేశ‌వ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లలో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్పనిస‌రి అయింది. ప్రేక్ష‌కులంతా…జాతీయ‌గీతం రాగానే లేచినిల్చుంటున్నారు. అయితే దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వ‌కార్యాల‌యాలు, కోర్టులు, అసెంబ్లీ, పార్ల‌మెంటుల్లో లేని ఈ నిబంధ‌న సినిమాహాళ్ల‌లోనే ఎందుకు అమ‌లు చేస్తున్నార‌ని ప‌లువురు ప్ర‌శ్నించారు.దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు దేశ‌భ‌క్తిని నిరూపించుకోడానికి సినిమాహాళ్ల‌లో లేచి నిల్చోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, జాతీయ గీతం వినిపిస్తున్న‌ప్పుడు ఎవ‌రైనా లేచి నిల్చోక‌పోతే..వారిని దేశ‌భ‌క్తి లేనివారిగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని తాజాగా స్ప‌ష్టంచేసింది. దీనిపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. నిజానికి జాతీయ గీతం వ‌స్తున్న‌ప్పుడు గౌర‌వ‌భావంగా ప్ర‌తి పౌరుడు లేచినిల్చోవాల‌ని రాజ్యాంగం నిర్దేశించింది. సినిమాహాళ్ల‌లోను ఇప్ప‌టిదాకా ఇదే అమ‌ల‌యింది. మ‌రి నిల్చోవాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు చేసిన అభిప్రాయాన్ని ఆస‌రాగా తీసుకుని ఒక్క సినిమా హాల్ లోనే కాకుండా..ఏ ఇత‌ర సంద‌ర్బాల్లోనూ జాతీయ గీతం వ‌చ్చిన‌ప్పుడు లేచి నిల‌బ‌డ‌డానికి దేశ‌పౌరులు ఇష్ట‌ప‌డ‌క‌పోతే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.