జీవీఎల్ గుట్టుమట్లు తవ్వకం మొదలైంది.

GGVL Narasimha rao assets to be declared by TDP

“ ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి”…అన్న నానుడి బీజేపీ తరపున ఆంధ్రప్రదేశ్ లో నానా రచ్చ చేస్తున్న జీవీఎల్ నరసింహారావు కి అతికినట్టు సరిపోతుంది. ఆయన యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక అయ్యేదాకా సొంత రాష్ట్రం ఏపీ లో జీవీఎల్ గురించి ఒక్క శాతం మందికి కూడా తెలియదు. ఆ పదవి వచ్చాక టీవీల్లో బీజేపీ వాణిని బలంగా వినిపిస్తోంటే కొత్త బిచ్చగాడులే అని బీజేపీ నేతలే వ్యాఖ్యానించడం తెలుసు. కానీ మోడీ , అమిత్ షా దగ్గర మేధావిగా మార్కులు కొట్టేసాడంటే జీవీఎల్ వ్యవహారశైలి గురించి జనం ఎంతో అనుకున్నారు. చివరికి అయ్యవారి వాగాడంబరం చూసి గజవాయు పీనం తప్ప ఇంకోటి కాదని అర్ధం అయ్యింది. కానీ జనాన్ని పిచ్చివాళ్ల కింద జమకట్టి నిన్న ఢిల్లీలో టీడీపీ ఎంపీలు రైల్వే జోన్ గురించి సంబంధిత మంత్రి దగ్గరకు వినతిపత్రం ఇద్దామని వెళితే అక్కడ జీవీఎల్ వేసిన వీరంగం చూసి ఇంత చవకబారు మనిషికి బీజేపీ ఎంపీ పదవి ఎలా ఇచ్చిందో అర్ధం కాలేదు. ఓ రాజకీయ పార్టీ మీద కోపంతో ఓ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడానికి , పైగా సొంత రాష్ట్రానికి ఆ అన్యాయం జరుగుతుంటే వంత పాడడానికి జీవీఎల్ ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. పైగా అదేదో వీరవిహారం లా భావిస్తున్నారు.

gvl

నిజానికి జీవీఎల్ కన్నా ముందే బీజేపీ లో చాలా మంది నాయకులు ఆంధ్రప్రదేశ్ లో నిబద్ధతతో పనిచేశారు. ఆ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాదని తెలిసి కూడా సిద్ధాంతపరంగా అందులోనే కొనసాగారు. తెలుగు రాజకీయాల్లో అలా రాణించిన వారిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ , మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు లాంటి వాళ్ళు పెద్ద ఉదాహరణ. వీళ్ళలో ఏ ఒక్కరు జీవీఎల్ లా వ్యవహరించలేదు. కానీ ఆయన మాత్రం గీత దాటి వ్యవహరిస్తున్నారు. జీవీఎల్ వ్యవహారశైలి వల్ల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పతనం ఇంకాస్త స్పీడ్ అవ్వడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. ఈ సంగతి పట్టించుకోకుండా బీజేపీ , జీవీఎల్ నరసింహారావు అడుగులు వేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ విషయం ఎలా ఉన్నప్పటికీ హద్దు దాటి వ్యవహరిస్తున్న జీవీఎల్ ని కంట్రోల్ చేయడం మీద టీడీపీ కాస్త గట్టిగానే దృష్టి పెట్టిందట. ఇందుకోసం ఓ ప్రత్యేక టీం ని కూడా సిద్ధం చేశారట. ఆ బృందం త్వరలో జీవీఎల్ ఆస్తులు సహా ఇతర అక్రమాలకు సంబంధించి బ్లాస్ట్ చేసే ఆరోపణలు , ఆధారాలతో జనం ముందుకు రాబోతోందట.