పోయాం మోసం…..పెళ్లి కొడుకు కావెలను.. ఏకంగా రూ. 4.60 లక్షలకు టోకరా

ఓ అమ్మాయి పెళ్లి చేసుకొనేందుకు పెళ్లికొడుకు కోసం ఆన్ లైన్ సెర్చ్ చేసింది. ఆన్ లైన్ లో పరిచయమైన ఓ కేటుగాడు ఆమెకు ఏకంగా రూ. 4.60లక్షలకు టోకరా పెట్టాడు. ఈ ఘటన తాజాగా బెంగళూరులో చోటుచేసుకుంది. ఆర్‌టీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ(36) పెళ్లి చేసుకునేందుకు మ్యారేజ్ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుంది. దీంతో ఆమెకు ఆండీ మైఖేల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. పెళ్లికొడుకు తాను లండన్‌లో వ్యాపారం చేస్తున్నానని.. వివాహం చేసుకుని భారత్‌లో స్థిరపడాలనుకుంటున్నానని మైఖేల్ ఆమెకు చెప్పి నమ్మించాడు.

ఆ తర్వాత కొద్దిరోజులు ఇద్దరూ బాగానే ఛాటింగ్ చేసుకున్నారు. మార్చి 28న ఆమెకు ఫోన్‌ చేసిన కేటుగాడు లండన్ నుంచి తాను ఓ బహుమతి పంపించానని చెప్పాడు. అదే రోజు రాత్రి ఆమెకు మరో వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. కస్టమ్స్ అధికారి అంటూ పరిచయం చేసుకొని… బహుమతి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలని చెప్పాడు. దీంతో ఆమె నమ్మి.. దఫాలుగా మొత్తం.. రూ.4.60లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసేసింది. తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.