నేను సంప్రదాయ ఆటగాడిని

నేను సంప్రదాయ ఆటగాడిని

నాకు ఐదు రోజుల ఆట చాలా ప్రత్యేకం. టెస్టు క్రికెట్‌ ఎన్ని రోజులు ఆడాలనేదానికి నేను వ్యతిరేకం. ఇప్పుడెలా ఉందో అలానే ఇష్టం అని ఆసీస్‌ మాజీ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ అన్నాడు. టెస్టు క్రికెట్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలని తాజాగా ఐసీసీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 2023-2031 వరకు ఐసీసీ నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది.

ఐసీసీ ప్రతిపాదనను కొందరు మాజీ ఆటగాళ్లు స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఐసీసీ కొత్త ప్రతిపాదనపై తాజాగా మెక్‌గ్రాత్‌ తన అభిప్రాయంను వెల్లడించాడు. ఓ క్రీడా వెబ్‌సైట్‌ ప్రచురించిన కథనం ప్రకారం… ‘నేను సంప్రదాయ ఆటగాడిని. నాకు ఐదు రోజుల టెస్ట్ ఆట చాలా ప్రత్యేకం. అంతకుమించి కుదించడమంటే నాకు అస్సలు నచ్చదు’ అని మెక్‌గ్రాత్‌ చెప్పినట్లు పేర్కొంది.

‘సంప్రదాయ ఆటను పింక్‌బాల్‌ టెస్టుగా (డే/నైట్‌) తీసుకొచ్చి మరింత ముందుకు తీసుకెళ్లడం చాలా మంచి పద్ధతి. ఇది క్రికెట్ ఆటకు మేలుచేసేదే. డే/నైట్‌ టెస్టులతో అభిమానులను మైదానానికి తీసుకురావచ్చు. అయితే, టెస్టు క్రికెట్‌ ఎన్ని రోజులు ఆడాలనేదానికి నేను వ్యతిరేకం. ఇప్పుడెలా ఉందో అలానే ఇష్టం’ అని మెక్‌గ్రాత్‌ అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయంపై స్పందిస్తూ ఇప్పుడే దీని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది అని అన్నాడు.

ఐసీసీ సంప్రదాయ క్రికెట్‌ను తప్పనిసరిగా కుదించాలనే ఆలోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట నాలుగు రోజులకే పరిమితం కానుంది. 2023-2031 మధ్య కాలంలో టెస్టులను ఐదు రోజులు కాకుండా నాలుగు రోజుల పాటు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. దీంతో బిజీగా ఉండే అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌లో ఆయా బోర్డులకు విరామం దొరుకుతుంది. ఈ సమయంలో మరిన్ని గ్లోబల్‌ ఈవెంట్స్‌ నిర్వహణకు వీలవుతుందని ఐసీసీ ఆలోచన.