జోర్దార్‌గా గోల్కొండ బోనాలు

Golconda bonalu

హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలు జోరందుకున్నాయి. బైండ్ల కళాకారుల డప్పుల దరువు, పోతరాజుల నృత్యాలు, జానపద కళాకారుల ఆటపాటలు, శివసత్తుల పూన కం, భక్తుల కోలాహలం నడుమ ఆదివారం గోల్కొండలోని జగదాంబ అమ్మవారికి రెండోబోనాన్ని సమర్పించారు. గత గురువారం భక్తులు తొలిబోనం పెట్టగా.. ఆదివారం రెండోబోనం సమర్పించారు. జోగినీలు తలపై బోనంతో నృత్యంచేస్తూ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. చేతిలో చెర్నాకోలలతో పోతరాజులు వీరంగంచేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. వివిధరంగాలవారికి ఆదివారం సెలవుదినం కావడంతో గోల్కొండ బోనాలకు భక్తులు భారీగా తరలివ చ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గోల్కొండ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పలువురు ప్రముఖులు, పలు పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు వేలల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌లోని పలుచోట్ల కూడా భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ముషీరాబాద్ డివిజన్ వైఎస్సార్ పార్కు ఎల్లమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు జరిగాయి. రేణు కా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి నైవే ద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా లోథ్‌లు బోనాల ఉత్సవాలు

గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ధూల్‌పేట ప్రాంతంలో లోథ్‌లు ఆదివారం బోనాల (భగీచే) ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొన్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న లోథ్‌లు ధూల్‌పేటలోని గంగాబౌలిలోని పహాడ్‌వాలి మాతా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలను సమర్పించుకున్నారు. ప్రతిఏటా గోల్కొండ బోనాలు ఆరంభమైన మొదటి ఆదివారం ధూల్‌పేటలో భగీచే ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. లోథ్ క్షత్రియ సదర్ పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ లోథా, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఘటోత్సవ అలంకరణను ప్రారంభించిన మంత్రి తలసాని

సికింద్రాబాద్ శ్రీఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాల్లో భాగంగా ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటోత్సవ అలంకరణను ప్రారంభిం చారు. దేవాలయం నుంచి మధ్యాహ్నం అ మ్మవారిని అలంకరణ నిమిత్తం కర్బలా మైదానానికి తీసుకెళ్లారు. అక్కడ అమ్మవారికి మంత్రి తలసాని పూజలు చేశారు. రాత్రి ఏడు గంటలకు కర్బలా మైదానంలో ముస్తాబైన అమ్మవారిని ఘటం ఊరేగింపుగా తిరిగి భక్తుల నృత్యాల మధ్య మహంకాళి దేవాలయానికి తరలించారు.