ఆ వార్త‌ల్లో నిజం లేదు… నా కూతురు చ‌దువుకుంటోంది

Gouthami gives Clarity about her Daughter movie entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త‌న కూతురు సినిమాల్లోకి వస్తున్న‌ట్టుగా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని హీరోయిన్ గౌత‌మి ఖండించింది. అర్జున్ రెడ్డి త‌మిళ్ రీమేక్ వ‌ర్మ‌లో గౌత‌మి కూతురు సుబ్బల‌క్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న‌ట్టు సోమ‌వారం వార్త‌లొచ్చాయి. దీనిపై గౌత‌మి ట్విట్ట‌ర్ లో స్పందించింది. ఈ వార్త‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ఆమె స్ప‌ష్టంచేసింది. త‌న కూతురు సినిమాల్లో న‌టిస్తోందంటూ వ‌చ్చిన వార్త‌లు చూసి షాకయ్యాన‌ని, సుబ్బల‌క్ష్మి ప్ర‌స్తుతం చ‌దువుకుంటోంద‌ని, ఇప్ప‌టికైతే త‌న‌కు న‌ట‌న‌పై ఎలాంటి ఆలోచ‌న‌లూ లేవ‌ని గౌత‌మి స్ప‌ష్టంచేసింది. త‌న కుమార్తెపై అంద‌రూ చూపుతున్న అభిమానానికి ధ‌న్య‌వాదాలు తెలిపింది.

సుబ్బ‌ల‌క్ష్మి సినీరంగం ప్ర‌వేశంపై గ‌తంలోనూ వార్త‌లొచ్చాయి. హీరో ధ‌నుష్ వీఐపీ 2 చిత్రం ద్వారా సుబ్బ‌లక్ష్మి హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతున్న‌ట్టు గ‌త ఏడాదిలో వదంతులు రాగా… ఇప్ప‌టిలానే అప్పుడు కూడా గౌత‌మి ట్విట్ట‌ర్ ద్వారా వాటిని ఖండించింది. ఆమె వ్యాఖ్య‌లు చూస్తే స్వ‌త‌హాగా చ‌దువును బాగా ఇష్ట‌ప‌డే గౌత‌మి త‌న కూతురు ఉన్న‌త‌విద్యావంతురాలు కావాల‌నే కోరుకుంటోంది కానీ… హీరోయిన్ కాద‌న్న అభిప్రాయం క‌లుగుతోంది. హీరో, హీరోయిన్ల వార‌సులు ఇబ్బ‌డిముబ్బ‌డిగా సినీరంగంలోకి దూసుకొస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో కూతురుని సినిమాల‌కు దూరంగా ఉంచాల‌ని గౌత‌మి నిర్ణయించుకోవ‌డం మంచి విష‌య‌మే.