వైరస్‌ కారణంగా ప్రాణాలు విడిచిన ప్రభుత్వ అధికారి

వైరస్‌ కారణంగా ప్రాణాలు విడిచిన ప్రభుత్వ అధికారి

కరోనా మహమ్మారి మరో సీనియర్‌ అధికారిని పొట్టన పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పనిచేసి విశేష సేవలందించిన ప్రభుత్వ అధికారి దేబ్‌దత్తా రే(38) వైరస్‌ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో ఆమె సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తీభవించిన మానవత్వంతో, క్లిష్ట వ్యవహారాలనను కూడా సునాయాసంగా పరిష‍్కరించడంలో ఆమె సునిశిత శైలిని గుర్తు చేసుకుని కన్నీంటి పర్యతమయ్యారు.

హూగ్లీ జిల్లాలోని చందానగర్ సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్ దేబ్‌దత్తా ఇటీవల కోవిడ్ అనుమానిత లక్షణాలతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో సెరాంపూర్‌లోని శ్రమజీబీ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

మరోవైపు దత్తా ఆకస్మిక మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించిన ఆమె మరణం తీరని లోటని ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం తరపున, ఆమె సేవలకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. కాగా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనాతో మరణించడం తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.