ప్రియురాలిపై తుపాకీతో కాల్పులు

ప్రియురాలిపై తుపాకీతో కాల్పులు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి వేరొకరికి సొంతం అవుతుందనే కోపంలో యువతి ఇంట్లోకి దూరి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో యువతి వదినకు బులెట్‌ తగలడంతో రక్తపుమడుగులో అక్కడే ప్రాణాలు విడిచింది. వివరాలు.. రోహిత్‌(24) అనే యువకుడు ఘజియాబాద్‌ జిల్లాలోని షేర్‌పూర్‌ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అయితే సదరు యువతికి వేరొకరితో పెళ్లి నిశ్చయమైందని రోహిత్‌ తెలుసుకున్నాడు.

తాను ప్రేమించిన యువతి మరొకరికి దక్కకూడదనే అక్కసుతో గురువారం రాత్రి షేర్‌పూర్‌ గ్రామంలోని ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. యువతిని బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా కుటుంబసభ్యులు అడ్డువచ్చారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో యువతి వదిన పవిత్రకు బులెట్లు తగిలి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

కాల్పుల శబ్దంతో స్థానికులు అప్రమత్తమయి పోలీసులకు సమాచారం అందించారు. అయితే రోహిత్‌ తన వెంట తెచ్చకున్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడినుంచి పారిపోయాడు. కాగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పవిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా తాను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయించారనే కోపంతో కాల్పులకు తెగబడ్డాడని ఎస్‌ఐ ఇరాజ్‌ రాజా తెలిపారు. రోహిత్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.