హలీం చరిత్ర ఏంటో తెలుసా ?

haleem food history

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రంజాన్ మాసం స్టార్ట్ అయిపొయింది ఈ నెల అంతా ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. అయితే, ఇస్లాం మతంలో చేసే ఉపవాసం మిగితా మతాలకంటే భిన్నమైనది. నెలవంక కనిపించినప్పటి నుండి మళ్ళి నెలవంక దర్శనం ఇచ్చేంత వరకు అంటే సుమారు 30 రోజుల పాటు సూర్యోదయం (సహర్) నుండి సూర్యాస్తమం (ఇఫ్తార్) వరకు రోజా (ఉపవాసం) ఉంటారు. అయితే ఎప్పుడు అయితే ఇఫ్తార్ అవుతుందో అప్పుడు వారు ఆహారం తీసుకోవచ్చు. ఇక ఇఫ్తార్ అంటే అందరికీ గుర్తిచ్చేది హలీమ్.

కేవలం ముస్లింలే కాదు అన్నిమతాలవారు దీనిని ఇష్టపడతారు. కబాబ్, శవర్మ, బిర్యాని, కునఫా, జిలేబి మొదలైన ఆహారాల గురించి కూడా కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇఫ్తార్ అయ్యిందంటే మసీదుకు వెళ్లి ఉపవాస దీక్షలను విరమిస్తుంటారు. ముందుగా ఖర్జూరాను తిని, ఆ తర్వాత తాజా పండ్లు, సమోసలు, రొట్టెలు… మొదలైనవి తింటారు. అయితే రంజాన్ అనగానే గుర్తొచ్చే వంటకాల్లో హలీం ముందుంటుంది. రంజాన్ ఉపవాస దీక్ష విరమించిన తర్వాత శరీరానికి తక్షణ శక్తిని అందించే వంటకమే హలీం. లేత పొట్టేలు మాంసంతో చేసిన వంటాకాన్ని హలీం అనీ, కోడి మాంసంతో చేసేదాన్ని హరీస్‌ అంటారు. ఈ వంటకాన్ని ముస్లింలతో పాటు మిగిలిన మతాల వారూ అంతే ఇష్టంగా తింటారు. ఒక పండుగ వంటకం గానే గాక ఇది గొప్ప పోషకాహారంగానూ గుర్తింపు పొందింది.

హలీం చరిత్ర

1866-1911 మధ్యకాలంలో హైదరాబాద్‌ను పాలించిన ఆరోనిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ రంజాన్ మాసంలో సైనిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి హాజరైన కొందరు పర్షియా ఆహ్వానితులు నాటి ఉపవాస దీక్ష విరమణ వేళ తమ దేశపు ప్రత్యేక వంటకాన్ని గురించి నవాబుకు తెలియజేసారు. అబ్బురపడిన నవాబు వంటగాళ్ళను పిలిచి పర్షియా ప్రతినిధుల సూచనల మేరకు దాన్ని సిద్ధం చేయించారు. అలా ఈ రోజు మనం ఎంతో ఇష్టంగా తినే హలీం హైదరాబాద్ గడ్డ మీద అవతరించింది. నిజానికి పర్షియా వంటకమైనా నిజాం చొరవతోనే ఇది ప్రపంచానికి పరిచయమైంది. ఏడో నిజాం నాటికి గొప్ప ప్రాచుర్యం పొందిన ఈ వంటకం ఇప్పుడు దేశవ్యాప్తంగా రంజాన్‌ వేళ అన్ని మతాలవారినీ ఒక్కటి చేస్తోంది.