దేశ రాజధానిలో భారీ వర్షాలు

దేశ రాజధానిలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్, గురుగ్రామ్, మనేసర్, ఫరిదాబాద్, నోయిడా, సోనిపట్, రోహ్‌తక్ తదతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో.. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు అంతరాయం తలెత్తింది.

మరో రెండు మూడు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని ప్రయివేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ వేదర్ వెల్లడించింది.జూన్ చివర్లో ఢిల్లీలోకి ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది జులై 13న దేశ రాజధానిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో… విపరీతమైన వేడి, ఉక్కపోతతో సతమతమైన ఢిల్లీ వాసులు.. వర్షాలు కురిశాక ఉపశమనం పొందారు. గత వారం వరకు ఢిల్లీలో 65 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపాతం లోటు 56 శాతానికి తగ్గింది.

భారీ వర్షాల కారణంగా గురుగ్రామ్‌లోని సదరన్ పెరిఫెరల్ రోడ్ జలమయమైంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. రుతుపవనాల ప్రభావంతో.. ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

సోమవారం ఉదయం 6 గంటల వరకూ పాలంలో 39 మీ.మీ., సఫ్దర్జంగ్‌లో 40 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. రహదారులపై వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది ఈ సీజన్‌లో సగటు కంటే ఎక్కువని ఐఎండీ తెలిపింది. అలాగే, నగరంలో కాలుష్య సూచీ 89గా ఉంది.