హలో గురు ప్రేమకోసమే రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

నటీ నటులు : రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, ప్రవీణ్ తదితరులు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
రచన : ప్రసన్న కుమార్
దర్శకత్వం : త్రినాద్ రావు నక్కిన
నిర్మాత: విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి

ఓ భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్, దర్శకుడు నక్కిన త్రినాథరావు కలిసి దిల్ రాజు నిర్మాతగా చేసిన సినిమా “ హలో గురు ప్రేమ కోసమే” . టైటిల్ తోనే ప్రేమ కధ అని తెలిసిపోయింది . పైగా ఈ మధ్య కొత్త కొత్త దర్శకులు సరికొత్త ఐడియాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలు సాధిస్తున్నారు. ఈ తరుణంలో నిజానికి “హలో గురు ప్రేమ కోసమే”మీద పెద్దగా అంచనాలు కూడా లేవు. అలా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ…

కాకినాడ నుంచి హైదరాబాద్ కి ఉద్యోగం కోసం వస్తాడు సంజు (రామ్ ). ఆ ప్రయాణంలో అను ( అనుపమ పరమేశ్వరన్ ) అనే అమ్మాయి కాకినాడ కుర్రోళ్లని తక్కువ చేసి మాట్లాడడంతో ఆమెకి బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తాడు. అయితే హైదరాబాద్ వెళ్ళగానే తాను వుండాల్సింది ఆమె ఇంట్లో గెస్ట్ గా అని తెలుస్తుంది. అను తండ్రి ( ప్రకాష్ రాజ్ ), సంజు తల్లి సితార మంచి స్నేహితులు. అలా ఆ ఇంట్లో ఉంటూనే ఆఫీస్ లో ఓ ఆమ్మాయికి సైట్ కొడుతుంటాడు సంజు. ఆ అమ్మాయి సంజు కి ఐ లవ్ యు అని చెప్పగానే , తాను అను తో ప్రేమలో ఉన్నట్టు రియలైజ్ అవుతాడు. ఆ విషయం చెప్పేలోగానే అను తండ్రి ఆమెకి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఈ పరిస్థితుల్లో అను తండ్రితో స్నేహం పెంచుకున్న సంజు ఏమి చేసాడు? కూతురు పెళ్లి కుదిరాక తన ఫ్రెండ్ కొడుకు ఆమెని లవ్ చేస్తున్నానని రావడంతో ఆ తండ్రి ఏమి చేసాడు అన్నది మిగిలిన కధ.

విశ్లేషణ …

pranitha

ఓ తండ్రి , కూతురు , ప్రేమికుడి మధ్య సంఘర్షణ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. నువ్వే నువ్వే , ఆకాశమంత తో మొదలైన ఈ తరహా కధలు చాలా వరకు విజయవంతం అయ్యాయి. అయితే కధకి కేంద్ర బిందువు తెలిసిపోవడంతో ఈ తరహా కధల మీద ఆసక్తి తగ్గింది. అయినా ఈ తరహా కథతో మరోసారి దిల్ రాజు , నక్కిన త్రినాధరావు , రామ్ కలయికతో వచ్చిన ఇంకో కొత్త కోణాన్ని అదే పాయింట్ చుట్టూ అల్లగలిగారు. సాధారణంగా అమ్మాయి ప్రేమ కోసం ప్రేమికుడు ట్రై చేస్తుంటే తండ్రి అడ్డం పడుతుంటాడు. కానీ ఇక్కడ హీరోయిన్ తండ్రి , హీరో మధ్య ఫ్రెండ్ షిప్ అనే లంకె వేసి ఈ కథని ముందుకు నడిపించడంతో తెలియకుండానే ఎప్పటికప్పుడు ఏమి అవుతుందో అన్న ఆసక్తి మొదలు అవుతుంది.

 పైగా మూడు ప్రధాన పాత్రలు కేవలం పాత్రల్లా కాకుండా ఓ తండ్రి , ఓ ప్రేమికుడు , ఓ కుమార్తె కి ప్రతినిధులు అన్నట్టు తీర్చిదిద్దడంలో నక్కిన త్రినాధరావు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారక్టరైజేషన్ ద్వారా వినోదం పండించిన అతను , రెండో అర్ధభాగం లో మూడు పాత్రల మధ్య సంఘర్షణని అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రతి పాత్ర తో ప్రేక్షకుడు మమేకం అయ్యేలా సీన్స్ , డైలాగ్స్ రాసుకున్నాడు. కొత్తదనం అనుకునే వాళ్లకి ఏమో గానీ కుటుంబ , ప్రేమ కధలు నచ్చేవాళ్ళకి ఈ సినిమా , ముఖ్యంగా అందులోని పాత్రలు ఇంటిదాకా వస్తాయి.

హీరో రామ్ కి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. చాలా బాగా చేసాడు. ఇక ప్రకాష్ రాజ్ ఓ తండ్రిగా విశ్వరూపం చూపాడు. ఓ మధ్య తరగతి తండ్రి గా అద్భుతం అనిపించాడు. అనుపమ పరమేశ్వరన్ కూడా సూపర్. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో తమ పాత్రల్ని రక్తి కట్టించారు.ఈ సినిమాకి కధ , ప్రధాన పాత్రలు , డైలాగ్స్ మూడు స్తంభాలు అయితే నాలుగో పిల్లర్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్. సాంకేతిక బృందం పనితీరు బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువలు రిచ్ గా అనిపించాయి.

తెలుగు బులెట్ పంచ్ లైన్ ….”హలో గురు ప్రేమ కోసమే “ పాత కధలో కొత్త కోణం.
తెలుగు బులెట్ రేటింగ్ ..3 /5 .