తెలుగు తేజం సింధుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు 

High Appreciations to Sindhu After Winning
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
భార‌త బ్యాడ్మింట‌న్ చ‌రిత్ర‌లోనే తొలిసారి కొరియా ఓపెన్ టైటిల్ సాధించిన తెలుగుతేజం పి.వి.సింధుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిప్ లో త‌న‌ను  ఓడించిన ఒకుహ‌ర‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటూ  కొరియా ఓపెన్ గెలుచుకున్న సింధుకు సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ లో శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. తన విజ‌యంతో సింధు మ‌రోసారి త్రివ‌ర్ణ ప‌తాకం గ‌ర్వంగా ఎగిరేలా చేసింద‌ని, ఇది ఎప్ప‌టికీ గుర్తుండిపోయే విజ‌య‌మ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కొనియాడారు. సింధును చూసి భార‌త్ గ‌ర్వ‌ప‌డుతోంద‌ని, ఆమె విజ‌యాల‌ను ఇక ఎవ‌రూ ఆప‌లేర‌ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు.
22 ఏళ్ల వ‌య‌స్సులోనే పి.వి. సింధు లెజెండ్ గా మారిపోయింద‌ని,  ఫైన‌ల్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చింద‌ని మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్ర‌శంసించారు. సింధూ త‌నేంటో మ‌రోమారు నిరూపించుకుంద‌ని, ఒకుహ‌ర పై స్వీట్ రివెంజ్ తీర్చుకుంద‌ని బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ట్వీట్ చేశారు. యావ‌త్ భార‌తం సింధును చూసి గ‌ర్విస్తోంద‌ని కేంద్ర‌మంత్రి  ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ అంటే..సింధు బ్యాడ్మింట‌న్ లో గొప్ప ప్ర‌త్య‌ర్థిగా ఎదుగుతోంద‌ని మాజీ క్రికెట‌ర్ వివీఎస్ లక్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు. త‌న‌పై ఉంచిన న‌మ్మకాన్ని సింధు నిజం చేసింద‌ని, ఆమె ఓ వారియ‌ర్ అని పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా కామెంట్ చేశారు. వీరితో పాటు ఎంద‌రో ప్ర‌ముఖులు సింధుపై పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించారు.