మీడియాకి ఎక్కాక పోలీసులకి చిక్కింది.

honeypreet arrested by Police

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
37 రోజుల అజ్ఞాతం త‌ర్వాత జ‌నంలోకి వ‌చ్చిన డేరాబాబా ద‌త్త‌పుత్రిక‌గా చెప్పుకునే హ‌నీప్రీత్ సింగ్ ను పంచ‌కుల పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ లోని జిరాక్ పూర్, పటియాలా మార్గంలో హ‌నీప్రీత్ ను హ‌ర్యానా పోలీసులు అరెస్టు చేశార‌ని పంచ‌కుల పోలీస్ క‌మిష‌న‌ర్ ఏఎస్ చావ్లా ప్ర‌క‌టించారు. బుధ‌వారం ఆమెను హ‌ర్యానా కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌నున్నారు. ఇద్ద‌రు సాధ్విల‌పై అత్యాచారం కేసులో గుర్మీత్ దోషిగా నిర్ధార‌ణ అయిన త‌రువాత చెలరేగిన విధ్వంసం వెన‌క హ‌నీప్రీత్ హ‌స్త‌ముంద‌ని హ‌ర్యానా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేర‌కు ఆమెపై కేసు కూడా న‌మోదుచేశారు. డేరా బాబా అరెస్టు త‌ర్వాత హ‌నీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. హ‌నీప్రీత్ నేపాల్ పారిపోయిందని వార్త‌లూ వ‌చ్చాయి.

అయితే కొన్ని రోజుల క్రితం ఆమె అరెస్టు ను త‌ప్పించుకునేందుకు హ‌ర్యానా హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. హైకోర్టు ఈ పిటిష‌న్ ను తోసిపుచ్చ‌డంతో ఆమె అరెస్టు కాక త‌ప్ప‌నిప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో స‌డ‌న్ గా మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌యింది హ‌నీప్రీత్ .  ఓ జాతీయ చాన‌ల్  ప్ర‌తినిధికి కారులో వెళ్తూ ఇంట‌ర్వ్యూ ఇచ్చిన హ‌నీప్రీత్… త‌న‌పై వ‌చ్చిన అనేక ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. త‌న‌కు, గుర్మీత్ కు మ‌ధ్య ఉన్న అనుబంధంపై మీడియాలో వ‌స్తున్న వార్త‌లు అబ‌ద్ధ‌మ‌ని..తమ‌ది ప‌విత్ర‌మైన తండ్రీ కూతుళ్ల బంధ‌మ‌ని స్ప‌ష్టంచేసింది. తాను ఎక్క‌డికీ పారిపోలేద‌ని, త‌న తండ్రి అరెస్ట‌య్యార‌న్న బాధ‌తోనే ఎక్క‌డికీ వెళ్ల‌కుండా ఇంట్లోనే ఉన్నామ‌ని ఆమె తెలిపింది. త‌న‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయ‌ని తెలిసి షాక‌య్యాను అని చెప్పారు.

త‌న తండ్రి దేశం కోసం ఎంతో చేశార‌ని, ఆయన కేసు కోసం హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తాన‌ని హనీప్రీత్ తెలిపింది. హ‌ర్యానా, పంజాబ్ న్యాయ‌స్థానాల‌పై త‌న‌కు న‌మ్మ‌క‌ముంద‌ని…కోర్టు ముందు లొంగిపోతాన‌ని కూడా ఆమె ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. అయితే ఆమె లొంగిపోవ‌డానికి ముందుగానే పంచ‌కుల పోలీసులు అరెస్టు చేశారు.  హ‌నీప్రీత్ అరెస్టు నేప‌థ్యంలో పంచ‌కుల‌లో భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.