పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి

పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి

ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నియమించారు. అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ కేబినెట్‌ సెలక్షన్‌ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్‌.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.

అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్‌ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఐఏఎస్‌కు ఎంపికైన తరువాత 2011లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్‌ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమ్రపాలి.. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్‌.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది.