పీఎస్ ఎల్ వీ-సి41 రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంతం

ISRO successfully launches IRNSS-11 navigation satellite

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశీయ దిక్సూచి వ్య‌వ‌స్థ కోసం ఉద్దేశించిన పీఎస్ ఎల్ వీ-సి 41 రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. శ్రీహ‌రికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం వేకువ‌జామున 4.04 గంట‌ల‌కు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 32 గంట‌ల కౌంట్ డౌన్ అనంత‌రం షార్ లోని మొద‌టి ప్ర‌యోగ వేదిక నుంచి 19.19 నిమిషాల వ్య‌వ‌ధిలో ల‌క్ష్యాన్ని చేరుకుంది. నాలుగు ద‌శ‌ల అనంత‌రం ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ -1ఐ ఉప‌గ్ర‌హం నిర్ణ‌యించిన స‌మ‌యానికి విడిపోయి క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించింది. దీని బ‌రువు 1425 కిలోలు. గ‌త ఏడాది ఆగ‌స్టు 31న పంపిన ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ -1 హెచ్ ఉప‌గ్ర‌హం ఉష్ణ‌క‌వ‌చం తెరుచుకోక‌పోవ‌డంతో బ‌య‌ట‌కు రాలేక‌పోయింది. దీంతో ఆ ప్ర‌యోగం విఫ‌ల‌మ‌యిన‌ట్టుగా ఇస్రో ప్ర‌క‌టించింది. దాని స్థానంలో ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ -1ఐ ఉప‌గ్ర‌హాన్ని ఇస్రో విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది.

ఈ ప్ర‌యోగంతో దేశీయ దిక్సూచి వ్య‌వ‌స్థ కోసం ఇస్రో ఇప్ప‌టివ‌ర‌కు 8 నావిగేష‌న్ శాటిలైట్ల‌ను నింగిలోకి పంపిన‌ట్ట‌యింది. ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ -1 ఐ నేల‌, నింగి, స‌ముద్రంలో మార్గ‌నిర్దేశనం చేయ‌నుంది. అమెరికా జీపీఎస్ త‌ర‌హాలో భార‌త ప్రాంతీయ దిక్సూచి ఉప‌గ్ర‌హ వ్య‌వ‌స్థ ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ పేరుతో స్వీయ వ్య‌వ‌స్థ నెల‌కొల్పేందుకు ఇస్రో ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. నావిక్ అనే పేరున్న ఈ వ్య‌వ‌స్థ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా స్థితి, దిక్సూచి, స‌మ‌య సేవ‌లు విశ్వ‌స‌నీయ స్థితిలో అందుతాయి. భార‌త్ చుట్టూ 1500 కిలోమీట‌ర్ల ప్రాంతం వ‌ర‌కూ ఈ సేవ‌లు ల‌భ్య‌మ‌వుతాయి. నావిక్ వ్య‌వ‌స్థ‌లోని ఉప‌గ్ర‌హాల సంఖ్యను 11కు పెంచాల‌ని ఇస్రో భావిస్తోంది. దీనివ‌ల్ల క‌చ్చిత‌త్వం పెర‌గుతుంది. ప్రాంతీయ స్థాయి సేవ‌ల‌కే పరిమిత‌మైన ఈ వ్య‌వ‌స్థ‌ను ఇస్రో అంత‌ర్జాతీయ స్థాయికి విస్త‌రించాల‌ని భావిస్తోంది. తాజాప్ర‌యోగం వ‌ల్ల‌ తీరానికి దూరంగా రోజుల త‌ర‌బ‌డి సముద్రంలో చేప‌ల‌వేట సాగించే మ‌త్స్య‌కారుల‌కు కీల‌క సేవ‌లు అందించ‌నుంది.