దిల్ రాజు ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ‘జాను’

దిల్ రాజు ఎంతో ఇష్టపడి చేసిన సినిమా 'జాను'

దిల్ రాజు ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ‘జాను.’ మామూలుగా ఒక భాషలో సినిమా రిలీజయ్యాక అది పెద్ద హిట్టయితే దాని రీమేక్ హక్కులు కొనడం మామూలే. కానీ రాజు మాత్రం తమిళ క్లాసిక్ ’96’ హక్కుల్ని విడుదలకు ముందే కొనేశారు. దీని టీజర్ చూసి ఫిదా అయిపోయి.. వెంటనే వెళ్లి చెన్నైలో ఆ సినిమా ప్రివ్యూ చూసి మరీ హక్కులు కొన్నారు రాజు.

ఆ తర్వాత సినిమా కూడా అక్కడ మంచి విజయం సాధించడంతో రాజు వెనక్కి తగ్గకుండా రీమేక్ పని మొదలుపెట్టేశారు. ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ’96’ లాంటి క్లాసిక్‌ను రీమేక్ చేస్తున్నందుకు అందరూ తనను పిచ్చోడిలా చూశారని.. కానీ తాను ప్రివ్యూ చూసి ఎలా గొప్ప అనుభూతికి లోనయ్యానో.. రేప్పొద్దున థియేటర్లలో సినిమా చూసి ఇదే అనుభూతి పొందుతారని ధీమాగా చెప్పాడు రాజు.

కట్ చేస్తే.. ’96’ను ఉన్నదున్నట్లుగా తెలుగులోకి తెచ్చినా సరే.. మన ప్రేక్షకులు ఆ సినిమాతో కనెక్టవ్వలేకపోయారు. చాలామంది ఒరిజినల్ చూసేసి ఉండటం వల్ల ఈ సినిమాను ప్రిఫర్ చేయలేదు. సినిమా చూసిన వాళ్లేమో మరీ స్లో అని.. ఒరిజినల్‌తో పోలిస్తే ఫీల్ తగ్గిందని.. ఇంకా ఏవేవో కామెంట్లు చేశారో. మొత్తానికి పాజిటివ్ టాక్, రివ్యూలు తెచ్చుకుని కూడా ‘జాను’ నిలవలేకపోయింది. సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది. ’96’ సినిమా పట్ల వ్యామోహం రాజుకు బాగానే క్షవరం చేసేలా ఉంది. ఈ సినిమాను మరీ ఎక్కువ రేట్లకు అమ్మకపోయినా.. దీని పూర్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ వల్ల నష్టం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది.

రాజు తన సినిమాల్ని ఎప్పుడూ తనతో అసోసియేషన్ ఉన్న బయ్యర్లకే ఇస్తాడు. వాళ్లు ఈ సినిమాకు నష్టపోయిన మొత్తాన్ని మినహాయించుకుని రాజు తర్వాతి సినిమాకు డబ్బులు కడతారు కాబట్టి నష్టం భరించాల్సింది రాజే. ఈ సినిమా వల్ల తక్కువలో తక్కువ ఐదు కోట్లయినా రాజుకు క్షవరం అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.