మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌

మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌

రాజ్‌భవన్‌లోకి గవర్నర్‌ రాజకీయాలు తెచ్చారని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన వ్యాఖ‍్యలపై ఆయన స్పందిస్తూ.. గవర్నర్‌ తమిళిసై బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని.. ఆమె వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. గవర్నర్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటిస్తుందన్నారు. గవర్నర్‌ వ్యవస్థను ఉపయోగించుకుని, బీజేపీ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.

‘‘గవర్నర్‌గా వస్తే గౌరవించడంలో మాకు ఎలాంటి‌ అభ్యంతరం లేదు. కానీ రాజకీయ పార్టీ నేతగా వస్తే గౌరవించాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ పాటించడం లేదనేది అవాస్తవం. ప్రొటోకాల్‌ పాటించకపోతే ఆక్షణంలోనే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. పెద్దవాళ్లను ఎలా గౌరవించాలనేది ముఖ్యమంత్రి మాకే నేర్పుతారు. గవర్నర్ వస్తున్నారంటే ముఖ్యమంత్రి స్వాగతం పలికి‌ గౌరవం ఇస్తారు. గవర్నర్‌ని‌ గౌరవించే విషయంలో ఏనాడు చిన్న తప్పుకూడా దొర్లలేదు. గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకు గవర్నర్ అలా స్పందించారో తెలియదు.

రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ సందర్భంలో రాజ్యాంగాన్ని, వ్యవస్థలను గౌరవించలేదో చెప్పాలి.రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు గ్యాప్ ఉందని మేం ఎప్పుడూ చెప్పలేదు. గవర్నరే పదే పదే మీడియా ముందుకు వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో చేసిన వ్యాఖ్య ఆశ్చర్యకరంగా ఉంది. రాజకీయరంగం కూడా సేవారంగమే. ఒకవేళ కౌశిక్ రెడ్డికి అది వర్తిస్తే గవర్నర్ వ్యవస్థకు అలానే వర్తిస్తుంది. గవర్నర్ వ్యవస్థ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది ఉంది. గతంలో ఇలానే ఉండేది.

స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తుల్ని‌ గవర్నర్లుగా నియమించలేదు. తర్వాత పార్టీ అధ్యక్షులుగా ఉన్నవాళ్లు తెల్లవారే సరికి గవర్నర్లుగా వచ్చారు. రాజ్‌భవన్‌ను రాజకీయ పార్టీకీ వేదికగా చేస్తామంటే ఎలా?. గవర్నర్ విషయం పెద్ద చర్చనీయాంశం కూడా కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మా పని పూర్తిచేస్తాం. గవర్నర్ వ్యవస్థకు సంబంధించి చాలా ఇలాంటి సందర్భాలు చూశాం. వ్యవస్థను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునే పార్టీలు విఫలమయ్యాయి. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కొందరు విఫల ప్రయత్నం చేస్తున్నారని’’ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.