విజయసాయికి కీలక బాద్యతలు అప్పగించిన జగన్

Jagan has given key voices to Vijayasai

వైసీపీలో నెంబర్ 2గా ప్రచారంలో ఉన్న విజయసాయి రెడ్డిని ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉత్తర్వులు వెలువరించారు. ఇదే సమయంలో లోక్ సభలో వైకాపా పక్షనేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లోక్ సభలో వైకాపా విప్ గా మార్గాని భరత్ లను నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి జగన్ ప్రత్యేక లేఖను పంపారు. తమ పార్టీ తరఫున వీరిని గుర్తించాలని ఆయన కోరారు. కాగా, ప్రస్తుతం విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, మిథున్ రెడ్డి, భరత్ లు తాజా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  మిథున్ రెడ్డి వరుసగా రెండోసారి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు.  కేంద్రంతో సంప్రదింపులు, బలమైన సంబంధాలు కొనసాగాలంటే సమర్ధవంతమైన వ్యక్తి అవసరమని గుర్తించిన జగన్, ఆ బాధ్యతలు విజయసాయి నిర్వర్తించగలరని భావిస్తున్నారు. అందుకే ఆయనను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. పార్టీలో కీలకనేతగా ఉన్న విజయసాయిరెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, చివరకు ఆయన్ను ఢిల్లీలో ఉంచడానికే జగన్ మొగ్గుచూపారు. విజయసాయి జగన్ వెన్నంటే ఉంటూ ఆయనకు కుడి భుజంలా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.