జ‌గ‌న్ పెట్టిన ష‌ర‌తుని ఒప్పుకుంటారా?

జ‌గ‌న్ పెట్టిన ష‌ర‌తుని ఒప్పుకుంటారా?

తెలుగుదేశం పార్టీ నుంచి మ‌రో ఎమ్మెల్యే జంప్ అవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమ‌యిన నేప‌థ్యంలో…ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. మంత్రులు పేర్నినాని, కొడాలి నాని ఈ సమావేశంలో పాల్గొన‌డంతో…వంశీ జంప్‌పై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో  జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.తాడేపల్లిలోని జగన్ నివాసంలో జ‌రిగిన ఈ భేటీపై అటు వంశీ ఇటు వైసీపీ అధికారికంగా ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు.

వ‌ల్లభనేని వంశీ పార్టీ మారతారనే ప్రచారం గ‌త కొద్దిరోజులుగా జరుగుతోంది. బీజేపీ లేదా వైసీపీలోకి ఆయ‌న ఫిరాయించ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకు ప‌లు సంఘ‌ట‌న‌లు సైతం బ‌లం చేకూర్చాయి. టీడీపీ మాజీ నేత‌, ప్ర‌స్తుత బీజేపీ అయిన‌ ఎంపీ సుజనా చౌదరిని శుక్ర‌వారం  ఉదయం వంశీ ఉదయం గుంటూరులో కలిశారు. వంశీ సుజనాతో భేటీ కావడంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే, ఒంగోలు వెళుతూ గుంటూరులో ఆగిన సుజనాను కలిసిన వంశీ కొద్దిసేపు సమావేశమయ్యార‌ని, త‌ర్వాత ఒకే కారులో ఇద్దరూ కలిసి ఒంగోలు వెళ్లార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

మ‌రోవైపు ఈ స‌మావేశం జ‌రిగిన కాసేప‌టికే…ఏపీ మంత్రి, టీడీపీలో ఒక‌నాటి త‌న స‌న్నిహితుడైన కొడాలి నానితో రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ స‌మావేశం త‌ర్వాతే…కొడాలి నానితో క‌లిసి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో వంశీ భేటీ అయ్యారు. ఇలా ఆస‌క్తిక‌రంగా వార్త‌ల్లో నిలిచిన వంశీ తెలుగుదేశం పార్టీకి మ‌రో రూపంలోనూ షాకిచ్చారు. ఇసుక కొరతను నిరసిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి వంశీ డుమ్మాకొట్టారు. అదే స‌మ‌యంలో బీజేపీ నేత‌ సుజనాను, అనంత‌రం ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌ను కలవడం వెనుక బ‌ల‌మైన కార‌ణాలే ఉండి ఉంటాయంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌తో ఆయన పార్టీ మారతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే, త‌న పార్టీలోకి ఎమ్మెల్యేలు చేరాల‌ని అనుకుంటే…రాజీనామా చేసి మాత్ర‌మే కండువా క‌ప్పుకోవాల‌ని  సీఎం జగన్ ష‌ర‌తు విధించిన నేప‌థ్యంలో ఒక‌వేళ వంశీ నిజంగా పార్టీ మారితే…జ‌గ‌న్ పెట్టిన ష‌ర‌తుని ఒప్పుకుంటారా? లేదా జ‌గ‌న్ త‌న ఆదేశాన్ని స‌డ‌లిస్తారా? ఇంత‌కీ వంశీ పార్టీ మారుతారా? అనేది తేలాలంటే…వేచిచూడాల్సిందే.