పార్టీలో చేరితే బాహుబ‌లి కాలేరు

Jana reddy says Revanth reddy didn't become Baahubali

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌. ఈ మ‌ధ్య అన్ని పార్టీల్లోనూ అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ… కాంగ్రెస్ లో మాత్రం ఇది త‌ర‌చుగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతూ ఉంటుంది. సాధార‌ణంగా ఏదైనా పార్టీలో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న నేత కాంగ్రెస్ లో చేర‌నున్నార‌న్న ఊహాగానాలు రాగానే… ఆ పార్టీ నేత‌లు స్పందిస్తారు. స‌దరు నేత పుట్టుపూర్వోత్త‌రాల‌ను వివ‌రిస్తూ… వారిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. ఆయ‌న రాకను అడ్డుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తారు. ఇవన్నీ అంత‌ర్గ‌తంగా కాదు… బ‌హిరంగంగానే… అంద‌రికీ తెలిసేట్టుగానే జ‌రుగుతుంటాయి. అయితే రేవంత్ రెడ్డి విష‌యంలో మాత్రం ఈ ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మ‌న‌సుల్లో ఏ భావంతో ఉన్నారో తెలియ‌దు కానీ… బ‌య‌ట‌కు మాత్రం ఆయ‌న్ను స్వాగ‌తించారు. హైక‌మాండ్ నుంచి వ‌చ్చిన ఆదేశాలో లేక‌… పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌న్న కార‌ణ‌మో తెలియ‌దు కానీ… రేవంత్ కు వ్య‌తిరేకంగా బ‌హిరంగంగా ఎవ‌రూ గ‌ళ‌మెత్త‌లేదు. దీంతో రేవంత్ పార్టీ మార‌డం ఓ ప్ర‌హ‌స‌నంలా కాకుండా చాలా సింపుల్ గా ముగిసిపోయింది. ఇది చూసిన‌వారికి రేవంత్ కు కాంగ్రెస్ లో ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయ‌న్న భావ‌న క‌లిగింది. కానీ అది త‌ప్ప‌ని తేలిపోయింది.

Jana reddy says Revanth reddy didn't become Baahubali

రేవంత్ అలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో లేదో… ఇలా ఆయ‌న‌పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఈ విమ‌ర్శ‌లు చేసింది ఎవ‌రో కాదు… తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి. ఎప్పుడూ ఎవ‌రిపై అంత‌గా విమ‌ర్శ‌లు చేయ‌ని జానా… రేవంత్ ను ఉద్దేశించి మాత్రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను అద్వానీ అంత‌టివాడిన‌న్నారు జానా. తాను సీఎం ప‌ద‌విని అడ‌గ‌న‌ని, అంద‌రూ కోరుకుంటే మాత్రం ప‌ద‌వి చేప‌డ‌తాన‌ని అన్నారు. గెలిచిన వాడే బాహుబ‌లి అవుతాడ‌ని, అంతే త‌ప్ప పార్టీలో చేర‌గానే ఎవ‌రూ బాహుబ‌లి కార‌ని, శ‌క్తిసామ‌ర్థ్యాలు నిరూపించుకుంటేనే బాహుబ‌లిగా నిలుస్తార‌ని జానారెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని… వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌… కాంగ్రెస్ బాహుబ‌లిగా అభివ‌ర్ణించిన నేప‌థ్యంలో జానా ఈ వ్యాఖ్య‌లు చేశారు. మొత్తానికి కాంగ్రెస్ నేత‌గా మారిన తొలిరోజే రేవంత్ కు సొంత పార్టీ నుంచి విమ‌ర్శ‌లు స్వాగ‌తం ప‌లికాయి.