దుమ్మురేపిన శ్రేయాస్‌ అయ్యర్‌

దుమ్మురేపిన శ్రేయాస్‌ అయ్యర్‌

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌లు దుమ్మురేపారు. శ్రీలంకతో ముగిసిన పింక్‌బాల్‌ టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసి అద్బుత ప్రదర్శన చేయగా.. అటు బ్యాటింగ్‌లో అ‍య్యర్‌ అర్థసెంచరీలతో మోతెక్కించాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 37వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఆరు స్థానాలు ఎగబాకి 830 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. షాహిన్‌ అఫ్రిది, కైల్‌ జేమిసన్‌, టిమ్‌ సౌథీ, జేమ్స్‌ అండర్సన్‌, నీల్‌ వాగ్నర్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌లు వరుసగా ఐదు నుంచి 10 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ లంకపై టెస్టు సిరీస్‌లో సూపర్‌ ప్రదర్శనతో తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి స్థానంలో పాట్‌ కమిన్స్‌ ఉండగా.. మూడో స్థానంలో కగిసో రబాడ మూడో స్థానంలో నిలిచాడు.

ఇక బ్యాటింగ్‌లో ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే.. కోహ్లి స్థానం మరింత దిగజారింది. లంకతో టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో 45, రెండో టెస్టులో 23, 13 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచిన కోహ్లి.. 742 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 754 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో 936 పాయింట్లతో ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్.. 872 పాయింట్లతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ రెండో స్థానంలో.. 851 పాయింట్లతో స్టీవ్‌ స్మిత్‌ మూడో స్థానంలో ఉ‍న్నాడు.

ఇక టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సెంచరీతో మెరిసిన లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే మూడు స్థానాలు ఎగబాకి 781 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.గతవారం ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విభాగంలో టాప్‌ స్థానంలో నిలిచిన రవీంద్ర జడేజా రెండో స్థానానికి పడిపోగా.. విండీస్‌ ఆటగాడు జాసన్‌ హోల్డర్‌ మళ్లీ తొలి స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో టీమిండియాకే చెందిన అశ్విన్‌ ఉన్నాడు.