జయహో ఇస్రో

24-1

Posted [relativedate]

jayaho isro
ఇస్రో చారిత్రాత్మక విజయం సాధించింది. అంతరిక్ష పరిశోధనల్లో తిరుగు లేదని మరోసారి నిరూపించింది. అగ్రదేశాలు కూడా చేయని సాహసం చేసి సక్సెస్‌ అయ్యింది. పి.ఎస్.ఎల్‌.వి-సి37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. సరిగ్గా ఉదయం 9 గంటల 28 నిమిషాలకు ప్రయోగం మొదలైంది. దాదాపు 20 నిమిషాల వ్యవధిలో రాకెట్‌ నుంచి ఉపగ్రహాలు వేరయ్యాయి. మొత్తం నాలుగు దశల్లో రాకెట్‌ కక్ష్యలోకి చేరింది. ఒక్కో బాక్స్ లో 25 ఉపగ్రహాల చొప్పున మొత్తం నాలుగు బాక్స్ లను రాకెట్‌ లో అమర్చారు.

ఇప్పటి వరకు ఒకేసారి 23 ఉపగ్రహాలను మాత్రమే పంపిన అనుభవం మాత్రమే ఇస్రోకు ఉంది. ఐతే ఒకేసారి 104 ఉపగ్రహాలు పంపించే విషయంలో ఇస్రో రిస్క్ చేసిందనే చెప్పవచ్చు. అంతర్జాతీయంగా రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా కక్ష్యలోకి పంపింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 29 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. తాజా ప్రయోగంతో భారత్‌ అగ్రదేశాల రికార్డు బద్దలు కొట్టినట్లైంది.

ఇస్రో అంతరిక్షంలోకి పంపిన 104 ఉపగ్రహాల్లో 101 విదేశాలకు చెందినవే. అమెరికా, ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, యూఏఈ కి చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో 96 ఉపగ్రహాలు అమెరికాకు చెందినవే కావటం విశేషం. తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోని ఉపగ్రహాలను పంపించటం ఇస్రో ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే చాలా దేశాలు ఇస్రో ద్వారా తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నాయి. ప్రస్తుత ప్రయోగం ద్వారా ఇస్రోకు భారీ మొత్తంలో ఆదాయం కూడా సమకూరనుంది.